మార్జిన్ దిగితే.. అంతే
ద్వారకాతిరుమల: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది క్షేత్రంలోని బైపాస్ రోడ్డు పరిస్థితి. ధ్వంసమైన పాత సీసీ రోడ్డును తొలగించి, నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీ కంటే రోడ్డును ఎత్తుగా నిర్మించడమే ఇందుకు కారణం. నూతన సీసీ రోడ్డును నిర్మించామని భుజాలు తట్టుకుంటున్న కూటమి నేతలు, పాలకులకు ఇది కనబడటం లేదా.. లేక చూసిచూడనట్టు నటిస్తున్నారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే. క్షేత్రంలోని కొత్త బస్టాండ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులు, కామవరపుకోట వైపుకు వెళ్లే వాహనాలు స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి సూపర్ బజార్ వరకు ఉన్న ఈ బైపాస్ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తాయి. భక్తులు, స్థానికులు, ప్రయాణికుల సౌకర్యర్ధం శ్రీవారి దేవస్థానం శతాబ్ద కాలం క్రితం, లక్షలాది రూపాయలు వెచ్చించి దీన్ని సీసీ రోడ్డుగా నిర్మించింది. అది ధ్వంసం కావడంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.40 లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి గతేడాది అక్టోబర్ 2న రాజమండ్రి కూటమి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేసి, పనులను త్వరితగతిన పూర్తిచేశారు.
ముందుచూపు లేకుండా..
రహదారి నిర్మాణానికి ముందు పాత సీసీ రోడ్డును పూర్తిగా తొలగించారు. ఆ తరువాత నూతన రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ముందుచూపు లేకుండా మెటల్ డస్ట్‌తో బెడ్‌ను ఎత్తుగా నిర్మించి, దానిపై సీసీ రోడ్డు పోయడంతో, డ్రైనేజీ కంటే రహదారి పెరిగింది. దాంతో ప్రస్తుతం వాహనాలు మార్జిన్‌లు దిగే వీలు లేకుండా ఉంది.
మార్జిన్ దిగితే అంతే సంగతులు
బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఈ రోడ్డుపై ఎదురుగా వచ్చినప్పుడు మార్జిన్ దిగేందుకు వీలులేక వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. అదే సమయంలో ఆ వాహనాలను తప్పించుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న ద్విచక్ర వాహనదారులు డ్రైనేజీల్లో పడిపోతున్నారు. కాస్త అజాగ్రత్తగా ఉంటే చాలు.. కార్లు ఇతర వాహనాలు సైతం మార్జిన్ దిగిపోతున్నాయి. మళ్లీ రోడ్డు మీదకు ఎక్కడం కష్టమవుతోంది. ఆ సమయంలో పక్కనే ఉన్న డ్రైనేజీలో వాహనం ఎక్కడ పడిపోతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. డ్రైనేజీపై సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసి, మార్జిన్‌లను నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
చేతులు దులుపుకున్న వైనం
రోడ్డు నిర్మించేశామని బీరాలు పలుకుతున్న కూటమి నేతలకు ఈ దుస్థితి కనబడటం లేదా.. లేక కనబడనట్టు నటిస్తున్నారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు కాంట్రాక్టర్ తనకు అప్పగించిన పని అయిపోయిందని చేతులు దులుపుకుని వెళ్లిపోయారు. కూటమి నేతలు రోడ్డు నిర్మించేశామని వారి భుజాలు వారే తట్టుకుని శెభాష్ అనుకుంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న ఈ దుస్థితిపై ప్రజలు మండి పడుతున్నారు. ఇదిలా ఉంటే నిర్మించిన కొద్దిరోజులకే రోడ్డు నాణ్యతపై కూటమి నాయకులే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం. ఏది ఏమైనా మార్జిన్‌లు సరిచేయకపోతే ఈ రహదారిపై పెనుప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ద్వారకాతిరుమలలో ప్రమాదకరంగా బైపాస్ రోడ్డు
డ్రైనేజీ కంటే ఎత్తుగా రహదారి నిర్మాణం
మార్జిన్ దిగే వీలు లేక వాహనదారుల ఇక్కట్లు
మార్జిన్ దిగితే.. అంతే
మార్జిన్ దిగితే.. అంతే


