
12న దక్షిణ భారత ఓబీసీ సెమినార్
మధురానగర్ (విజయవాడసెంట్రల్): సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం పదో వార్షికోత్సవం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు తట్టి అర్జునరావు, అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ, కురుమ, కురవ సంఘం ఆధ్వర్యంలో సంఘ పదో వార్షికోత్సవం, సౌత్‌ఇండియా ఓబీసీ సెమినార్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెమినార్‌కు రాజకీయాలకు అతీతంగా దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు హాజరుకానున్నట్లు చెప్పారు. షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నార్త్ నుంచి 6 రాష్ట్రాలు, సౌత్ నుంచి 6 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం తట్టి అర్జునరావు ఎన్నికల అధికారిగా ఆయన పర్యవేక్షణలో నూతన కార్యవర్గం ఎంపిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.