
ఇదేనా.. స్వచ్ఛ మున్సిపాలిటీ?
● భీమవరంలో ఎక్కడి చెత్త అక్కడే
● అయినా స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు
● ఆశ్చర్యపోతున్న పట్టణవాసులు
భీమవరం(ప్రకాశం చౌక్): స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డుల్లో జిల్లా స్థాయిలో స్వచ్ఛ మున్సిపాలిటీగా భీమవరం మున్సిపాలిటీ అవార్డు అందుకోవడంపై భీమవరం ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మా కాలనీల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది..చెత్త తీయండి మహాప్రభో అని నేరుగా మున్సిపాలిటీకి మహిళలు సైతం వెళ్లి గగ్గోలు పెట్టే పరిస్థితి ఉన్నా మున్సిపాలిటీకి మాత్రం స్వచ్ఛ మున్సిపాలిటీగా అవార్డు ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న కలెక్టరేట్ వద్ద కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదగా స్వచ్ఛ మున్సిపాలిటీగా భీమవరం మున్సిపాలిటీకి అవార్డు అందుకున్నారు. పట్టణంలో మధ్యాహ్నం 1 గంట వరకు చెత్త తీయరని, కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి చెత్త తీస్తారని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని డ్రెయిన్లన్నీ చెత్తచెదారంతో అధ్వానంగా ఉన్నా అవార్డు రావడం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
39 వార్డుల్లోనూ పారిశుద్ధ్యం అధ్వానం
భీమవరం మున్సిపాలిటీలో 39 వార్డులు ఉన్నాయి. దాదాపు ప్రతి వార్డులో చెత్తాచెదారం ఎక్కడబడితే అక్కడ ఉంటుంది. డ్రెయిన్లలో కూడా చెత్తాచెదారం పేరుకుపోయి డ్రెయినేజి నీళ్లు రోడ్డుపై ప్రవహించే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమవరంలో ఒక డ్రెయినేజీను కూడా బాగు చేయడం గానీ, ఎత్తు పెంచి నిర్మించడం గానీ చేయలేదు. ముఖ్యంగా పట్టణంలో చెత్తతో, దోమలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నూటికి నూరు శాతం తొలగింపు ఎక్కడ?
భీమవరం పట్టణంలో మొత్తం 38,744 కుటుంబాలు ఉండగా 1.50 లక్షల మంది జనాభా ఉన్నారు. రోజుకు 70 టన్నుల చెత్త వస్తుందని అంచనా. అయితే మున్సిపాలిటీ మాత్రం 60 నుంచి 70 శాతం మేర చెత్తను డంప్ చేస్తుంది. నూటికి నూరుశాతం చెత్తను తొలగించడం లేదు. దాంతో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అలాంటి మున్సిపాలిటీకి ఏ విధంగా కూటమి ప్రభుత్వంలో అధికారులు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు ఇప్పించారో? వారికే తెలియాలని పట్టణవాసులు ఎద్దేవా చేస్తున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియదా?
భీమవరం మున్సిపాలిటీకి స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు అందించిన జిల్లా కలెక్టర్, కేంద్ర సహయ మంత్రి భూపతిరాజుశ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే అంజిబాబుకు భీమవరం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం ఏ స్థాయిలో ఉంటుందో? వారికి తెలియదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ కలెక్టర్ కలెక్టరేట్‌కు వచ్చే దారిలో అంటే పీపీ రోడ్డులో డ్రెయిన్లు ఏ స్థాయిలో ఉన్నాయో? ఆమెకు తెలియదా? అని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు నివాసం ఉండే బ్యాంకు కాలనీలో డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయని, పలు వీధుల్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుందని చెబుతున్నారు. ఇక కేంద్రమంత్రి ఉండే నాలుగో వార్డు, ఆర్టీసీ డిపో, దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో డ్రెయిన్‌లు అధ్వానంగా ఉండడంతో పారిశుద్ధ్యం దారుణంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు.

ఇదేనా.. స్వచ్ఛ మున్సిపాలిటీ?