
రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రజలదేనా..?
● ఉండి–గణపవరం రోడ్డు అధ్వానం
● గుంతలు సరి చేసి.. సూచికలు ఏర్పాటు చేస్తున్న ప్రజలు
ఉండి: నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. జాతీయ రహదారి 165తో పాటు రాష్ట్ర రహదారులు, ఆర్‌అండ్‌బీ, ఇంటర్నల్‌రోడ్లు నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఉండి–గణపవరం రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని చెబుతున్నారు. ఉండి నుంచి పాములపర్రు, వెలివర్రు, కోలమూరు, ఉప్పులూరు, పాందువ్వ, ఆరేడు, కలిగొట్ల గ్రామాలకు చెందిన ప్రజలు ఇదే రోడ్డుపై ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రోడ్డు పేరుకే రాష్ట్ర రహదారి అని, కానీ ఈ రోడ్డు నిర్వహణను ఆర్‌అండ్‌బీ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ రోడ్డకు ఓ వైపు బొండాడ మేజర్ డ్రెయిన్ ఉంది. అయితే ఈ రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం, నాణ్యత లేకపోవడం వల్ల రోడ్డు వేసినా లేక మరమ్మతులు చేసిన కొద్దిరోజులకే మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది.
ఆ బాధ్యత తీసుకున్న ప్రజలు
ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో స్థానికులు కోలమూరులో రోడ్డుపైనే ఇసుకబస్తాలు పెట్టి వాటిల్లో కర్రలు పెట్టి వాటికి ఎర్రని బట్టలు చుట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే కోలమూరు గ్రామ పరిధిలో రోడ్డుకు ఆనుకుని వుండే పంబోదె ఆక్రమణకు గురైందంటూ గతంలో తవ్వేశారు. అయితే రోడ్డుకు ఆనుకుని బోదె తవ్వడంతో ఇప్పుడు రోడ్డు బోదెలోకి కుంగిపోతుంది. కొద్దిరోజుల క్రితం ఓ ద్విచక్రవాహనదారుడు కుంగిన రోడ్డు గుంతలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానికంగా ఉండే రైతులు తమ పని ముగిసిన తరువాత పొక్లెయినర్ సాయంతో ఈ రహదారికి మరమ్మతులు చేయించారు. ఉండి నుంచి తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అలాగే తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి నుంచి విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు ఎక్కువగా ఈ రహదారినే వినియోగిస్తూ ఉంటారు. ఇంతటి ప్రముఖమైన ఈ రోడ్డును అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.

రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రజలదేనా..?