
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
పెనుమంట్ర: మండలంలోని సోమరాజు ఇల్లిందలపర్రు గ్రామంలో మాజీ సర్పంచ్ కర్రి కమల ఇంట్లో సెప్టెంబర్ 16న జరిగిన దోపిడీకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు విలువచేసే 324.540 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్ తెలిపారు. పెనుమంట్ర పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 16న రాత్రి 7:45 ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియ వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తన అత్తగారిని, తనను తాళ్లతో బంధించి తన మెడపై కత్తి పెట్టి చంపుతామని బెదిరించి ఇంట్లో ఉన్న రూ.35 లక్షలు విలువైన బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు, రెండు రెండుసెల్ ఫోన్‌లను చోరీ చేశారని కర్రి జ్ఞాన చంద్రిక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశామని వివరించారు. దర్యాప్తులో ఈ దోపిడికి సూత్రదారి అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన వెలగల నరేందర్ రెడ్డిని గుర్తించామన్నారు. దోపిడీకి పాల్పడిన వారిని అల్లూరి సీతారామరాజు జిల్లా తులం గ్రామానికి చెందిన తెరవాడ హనుమంతరావు, నంద్యాల జిల్లా తువ్వ పల్లి గ్రామానికి చెందిన చింతల సుధాకర్‌గా గుర్తించామన్నారు. ఈ ముగ్గురిని నత్త రామేశ్వరం సెంటర్లో ఆభరణాలతో సహా పట్టుకుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో పెనుమంట్ర ఎస్సై కె.స్వామి, ఆచంట ఎస్సై కె.వెంకటరమణ, భీమవరం సైబర్ క్రైమ్ ఎస్సై రవికుమార్ పాల్గొన్నారు.