
వేడుకగా శ్రీచక్రస్నానం
● నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
● రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు బుధవారం స్వామివారికి శ్రీచక్ర స్నానాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి గ్రామోత్సవాన్ని తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా జరిపారు. ఆ తరువాత ఆలయ యాగశాలలో స్వామి, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవమూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచ పల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్రపూత అభిషేక తీర్థంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. ఆ తరువాత శ్రీచక్ర పెరుమాళ్లతో పాటు ఉభయ నాంచారులకు, శ్రీవారికి తిరుమంజనాలు జరిపి, హారతులిచ్చారు. అభిషేక జలాన్ని భక్తుల శిరస్సులపై చల్లారు. సాయంత్రం ఆలయంలో నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం అశ్వవాహనంపై స్వామి వారి తిరువీధి సేవ అట్టహాసంగా జరిగింది. అలాగే ఆలయ ముఖ మండపంలో శ్రీవారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం రాత్రి జరగనున్న శ్రీపుష్ప యాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని, శుక్రవారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు..
● ఉదయం 8 గంటల నుంచి – భజనలు
● ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం, వసంతోత్సవం
● ఉదయం 9 గంటల నుంచి – భక్తి రంజని
● ఉదయం 10 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● సాయంత్రం 4 గంటల నుంచి – నాదస్వరకచేరి
● సాయంత్రం 5 గంటల నుంచి – హరికధ
● సాయంత్రం 6 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు
● రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగము
● ప్రత్యేక అలంకారం : శయన మహావిష్ణువు

వేడుకగా శ్రీచక్రస్నానం

వేడుకగా శ్రీచక్రస్నానం

వేడుకగా శ్రీచక్రస్నానం