
పల్లె వ్యవస్థలు నిర్వీర్యం
ఈ చిత్రంలోని భవనాలను చూశారా? గ్రామ ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వ హయాంలో మండల కేంద్రం పెనుగొండలో దాదాపు రూ.87 లక్షలు వెచ్చించి పక్కపక్కనే నిర్మించిన సచివాలయం, ఆర్‌బీకే, ఆరోగ్య కేంద్రం భవనాలివి. కొద్దిపాటి మైనర్ పనులు చేస్తే చాలు వినియోగంలోకి వచ్చే వీటిని పట్టించుకునే వారు లేక ఏడాదిన్నరగా ఇలా నిరుపయోగంగా ఉండిపోయాయి.
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. పల్లె ప్రజలు మండల, జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లతో పాలనను పల్లెలకు చేర్చింది. వాటి కోసం సుమారు రూ.141.2 కోట్ల వ్యయంతో జిల్లాలో 353 సచివాలయ భవన నిర్మాణాలు, రూ.65 కోట్లతో 298 ఆర్‌బీకేలు, రూ.53.5 కోట్లతో 214 హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం చేపట్టింది. వీటిలో 270 సచివాలయాలు, 211 ఆర్‌బీకేలు, 96 హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు పూర్తిచేసి అప్పట్లోనే వినియోగంలోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులివ్వక మిగిలిన భవనాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి.