
బాలికపై దాడికి యత్నించిన వీధి శునకాలు
ద్వారకాతిరుమల : వీధి కుక్కలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. చిన్న పిల్లలపై తరచూ ఎక్కడో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ద్వారకాతిరుమలలోని రాణీ చిన్నయమ్మారావు పేటలో గురువారం రెండు వీధి కుక్కలు ఒక బాలికపై దాడికి ప్రయత్నించాయి. అయితే వాటి బారి నుంచి తప్పించుకుని ఆ బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం స్థానికంగా నివాసం ఉంటున్న భార్గవి తన పాప కాషికను ఉదయం పాఠశాలకని ఇంటి నుంచి పంపింది. కాషిక నడుచుకుంటూ కాస్త దూరం వెళ్లగానే రెండు వీధి కుక్కలు అరుచుకుంటూ కాషిక మీదకు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన కాషిక పెద్దగా అరుస్తూ తన ఇంటి వైపునకు పరుగులు తీసింది. ఆ అరుపులు విన్న భార్గవి కంగారుగా రోడ్డు మీదకు వచ్చింది. వెంటనే కాషిక పరిగెట్టుకుంటూ వచ్చి తల్లిని పట్టుకుంది. వణికిపోతున్న పాపను దగ్గరకు తీసుకోగా, ఆ శునకాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాప శునకాలకు చిక్కితే పెనుప్రమాదం జరిగేదని, రోడ్డు మీదకు రావాలంటేనే భయమేస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, వీధి కుక్కల బెడదను తొలగించాలని కోరుతున్నారు.