
యాజమాన్య పద్ధతులు పాటించాలి
పోలవరం రూరల్: యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా వరిలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకునల్లి తెగుళ్లను నివారించవచ్చని ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ అన్నారు. గూటాల, కొత్త పట్టిసీమ రైతులకు వరి పొలంలో ఆశించే ఎండాకు తెగులు, ఉల్లికోడు, ఆకు నల్లిపై రైతులకు అవగాహన కార్యక్రమం గూటాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో ఆశించే ఎండాకు తెగులు నత్రజని ఎరువులు అధికంగా వాడడం వల్ల, వాతావరణ పరిస్థితులు వల్ల ఆశిస్తుందన్నారు. నత్రజని ఎరువులు వాడకాన్ని తక్కువ మోతాదులో వాడటం– పోటాష్ ఎరువును అధిక మోతాదులో వాడుకుంటే ఈ ఎండాకు తెగులు కొంతవరకు అరికట్టవచ్చన్నారు. మురికి నీటిని ఎప్పటికప్పుడు తీస్తూ కాలువలో ఉన్న నీరుని ఎప్పటికప్పుడు చేల్లో పెట్టుకుంటూ ఉండాలన్నారు. ఎండాకు తెగులు ఆశించిన పొలాల్లో కాప్రాక్సీ క్లోరైడ్ రెండు గ్రాములు లీటరు నీటికి, లేదా ప్లాంటు మైసనోగ్రామ్ లీటరు నీటికి కలిపి చేనంతా తడిచేలా పిచికారీ చేయాలన్నారు. వరి దుబ్బుకు రెండు కన్నా ఎక్కువగా ఉల్లికోడు ఉన్నట్లయితే నివారణ చర్యలు చేపట్టుకోవాలన్నారు. పెప్రోనిల్ 2 ఎంఎల్ లీటరు నీటికి లేదా క్లోరీఫైరిపాస్ 2.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ముదురునారు నాటడం వల్ల ఉల్లికోడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉందన్నారు. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటరు నీటికి లేదా డైకో ఫాలో 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు.