నీరు.. నేలతో ఆక్వా వహ్వా..! | - | Sakshi
Sakshi News home page

నీరు.. నేలతో ఆక్వా వహ్వా..!

Sep 12 2025 4:59 PM | Updated on Sep 12 2025 4:59 PM

నీరు.

నీరు.. నేలతో ఆక్వా వహ్వా..!

పర్యావరణ సమతుల్యతకు మూలం

ఆక్వా సాగులో ఆ రెండే కీలకమంటున్న నిపుణులు

కొల్లేరు నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలం

కై కలూరు: ఆక్వా సాగు అంటే రైతులకు సిరులు అందించే కల్పతరువుగా భావిస్తారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఎక్కువగా చేస్తారు. అయితే ఇటీవల ఆక్వా సాగులో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సాగుపై సరైన అవగాహన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. చేపలు, రొయ్యల పెంపకం నీరు, నేల యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చెరువు అడుగున వీటి మధ్య పరస్పర చర్య జరుగుతుంది. నీటి నాణ్యత, ప్లాంక్టాన్‌ పెరుగుదల పంట దిగుబడిని నేరుగా ప్రభావితం చేస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ప్రధానంగా కొల్లేరు ప్రాంతంలో నల్లరేగడి నేలల్లో సాగు ఎక్కువుగా జరుగుతోంది. నేల స్వభావం దెబ్బతింటే స్థూల, సూక్ష్మ మూలకాలు పెరిగి పంట ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. నీటి నాణ్యత లోపం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది పేను, తాటాకు తెగులు, శంకు జలగ, జిగురు వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీరు, నేలపై ఆక్వా నిపుణులు తెలిపే సూచనలను ఓ సారి తెలుసుకుందాం.

నీటి నాణ్యతపై శ్రద్ధ అవసరం

మంచి నేల నిర్వహణ ఎంతో ముఖ్యమో సరైన నీటి నాణ్యత పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. సాగు చేసే చెరువు నీటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేట్‌ మధ్య ఉంటాయి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేట్‌ కంటే తగ్గితే, పెరుగుదల బాగా తక్కువగా ఉంటుందని అర్థం. పారదర్శకత 25–40 సెంటీమీటర్లు ఉండాలి. చేపలు, రొయ్యల పెరుగుదలను నిర్ధారించడానికి కరిగిన ఆక్సిజన్‌ 5 పీపీఎం అంతకంటే ఎక్కువ ఉంచాలి. పగటిపూట అధిక హెచ్చుతగ్గులు లేకుండా నీటి పీహెచ్‌ 7.5–8.5 మధ్య ఉండాలి. రైతులు అమ్మోనియా, నైట్రేట్‌, హైడ్రోజన్‌ సల్ఫయిడ్‌ వంటి విష వాయువుల నుంచి కూడా జాగ్రత్త వహించాలి.

ఆక్వాసాగులో నేల పాత్ర ఇలా

చెరువు సాగులో ఒండ్రు, నల్లరేగడి నేలలు నీటి నిలుపుదల శక్తిని కలిగి ఉంటాయి. ఇవి సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నతను నియంత్రిస్తాయి. పీహెచ్‌ (6.5–7.5) సమతుల్యంగా ఉంచితే మంచి నేలలుగా పరిగణించాలి. నేలలో కాల్షియం, కార్బోనేట్‌ 5 శాతం కంటే ఎక్కువుగా ఉంటే మంచి సామర్థ్యం కలిగిన నేలలుగా భావించాలి. అల్యూమినియం, మాంగనీస్‌ వంటి విషవారిత లోహాలు నీటిలో కరిగిపోకుండా నేలలు నిరోధిస్తుంది. సేంద్రియ పదార్థం 2 శాతం కంటే ఎక్కువ ఉన్న నేలలు నీటి లీకిజీని తగ్గించి, సూక్ష్మజీవుల అభివృద్ధికి మద్దతు ఇస్తాయి. చౌడు నేలలు సేంద్రియ పదార్థం విచ్ఛిన్నాన్ని తగ్గించి, ప్లాంక్టాన్‌ పెరుగుదలను పరిమితం చేస్తాయి.

నేల, నీటి మధ్య రసాయనాల మార్పిడి

చెరువు అడుగున, నేల, నీరు నిరంతరం ఒకదానితో ఒకటి పరస్పర చర్యలకు గురవుతాయి. ఆమ్ల నేలలు చెరువు పీహెచ్‌ని తగ్గిస్తాయి. క్షార నేలలు కార్బోనేట్‌ నిక్షేపాలను పెంచుతాయి. నేలలు నత్రజని, భాస్వరం గిడ్డంగులుగా పనిచేస్తాయి. ఫ్లాంక్టన్‌ పెరుగుదలకు తోడ్పడటానికి లవణాలను క్రమంగా విడుదల చేస్తాయి. వృథా అయిన మేత, జంతువుల వ్యర్థాలు పేరుకుపోయినప్పుడు, ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గి, అమ్మోనియా స్థాయిలు పెరుగుతాయి. బాగా ఆక్సిజన్‌ నిండిన నేలలు ఆరోగ్యకరమైన విచ్ఛేదనాన్ని ప్రోత్సహిస్తాయి. ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న నేలలు హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, మీథేన్‌ వంటి విష వాయువులను విడుదల చేస్తాయి.

రొయ్యల చెరువులో తిరుగుతున్న ఏరియేటర్లు(ఫైల్‌) చేపల పట్టుబడి చేస్తున్న కార్మికులు

నేల, నీరు కలిసి చెరువు పర్యావరణ సమతుల్యతను నిర్ధారిస్తాయి. ఆక్వాసాగులో ఈ రెండు వీడదీయరాని బంధంగా ఉంటాయి. చేపల, రొయ్యల రైతులు నేల, నీరు, మేతలు వంటి వాటిపై సరైన అవగాహనతో ఉండాలి. నీటి, మట్టి పరీక్షలను ఆక్వా ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోవాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను పాటించాలి. సమస్య గుర్తిస్తే ఆక్వా నిపుణులను సంప్రదించాలి.

– డాక్టర్‌ పి.రామమోహన్‌రావు, విశ్రాంత డిప్యూటి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, కాకినాడ

నీరు.. నేలతో ఆక్వా వహ్వా..! 1
1/1

నీరు.. నేలతో ఆక్వా వహ్వా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement