
పెరిగిన వర్జీనియా పొగాకు ధర
కేజీకి రూ.395 రికార్డు ధర
జంగారెడ్డిగూడెం: చాలా రోజులు స్థిరంగా కొనసాగిన వర్జీనియా పొగాకు ధర ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చింది. ఇలా పెరుగుతూ వచ్చిన ధర గురువారం కేజీ ధర రూ. 395కు చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం–1, –2, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లిలో వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది వర్జీనియా వేలం ప్రారంభం సమయంలో కేజీకి రూ.290 మాత్రమే లభించింది. గత ఏడాది అత్యధికంగా కేజీకి రూ.411 లభించగా, కేజీ సరాసరి ధర రూ.330 లభించింది. ఈ ఏడాది వర్జీనియా వేలం ప్రారంభం నాడు రూ.290 ధర రాగా, క్రమేపీ పెరుగుతూ జూలై నెల చివరి వరకు కేజీ ధర అత్యధికంగా రూ.390 లభించింది. కేజీ ధర అత్యల్పంగా రూ.200 లభించింది. ఆ తరువాత జూలై 26 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు అత్యధిక ధర రూ.20 పడిపోయి రూ.370 లభించింది. అత్యల్ప ధర రూ.200 లభించింది. ఆ తరువాత ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ ధర మరింత పడిపోయి అత్యధిక ధర కేజీ రూ.350, అత్యల్పధర రూ. 200 లభించింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కేజీ ధర రూ.390 నుంచి రూ. 350కు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆయా కంపెనీలు సిండికేట్‌గా మారి పొగాకు ధరను తగ్గించి కొంటున్నారని రైతులు ఆరోపించారు. రూ.390 నుంచి రూ.350కు పడిపోయిన ధర సుమారు 25 రోజుల పాటు రూ.350 వద్ద స్థిరంగా కొనసాగింది. సెప్టెంబర్ 3న కొద్దిగా పెరిగి కేజీ ధర రూ.362, 4న రూ.375, 6 నుంచి 8 వరకు రూ.376 లభించింది. 9, 10వ తేదీన ఈ ధర మరింతగా పెరిగి రూ.390కు చేరుకుంది. గురువారం ధర రూ. కేజీ ఒక్కింటికి రూ.395 రాగా, అత్యల్పం రూ. 200 లభించింది. కాగా గురువారం నాటి వేలంలో జంగారెడ్డిగూడెం –1, 2 వేలం కేంద్రాలు, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో అత్యధిక ధర కేజీ ఒక్కింటికి రూ. 395 లభించగా, గోపాలపురం వేలం కేంద్రంలో రూ.394 లభించింది. అలాగే గురువారం నాటికి సరాసరి ధర రూ. 296.34 లభించింది.