
నేడు నృత్య అవార్డుల ప్రదానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన నటరాజ నాట్య కళాకేంద్రం, కళాదీపిక నృత్య అకాడమీ, శ్రీశ్రీ కల్చరల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 13న 12వ జాతీయ స్థాయి నృత్య అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు నిర్వాహకుడు ఎన్.రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో నృత్య రంగానికి విశేష కృషి చేసిన గురువులు జీ చైతన్య, నీలమ్ ముత్యాలు, కే ప్రశాంత్ కుమార్, కే ఖ్యాతీశ్వరి, జీవీఎస్‌ఎల్ లాస్య, ఎం.అనూష బహదూర్, బీ శారద, కే రమేష్ నాయుడు, ప్రసాద్, టీ దివ్య సుహాసిని, ఐ సాయి నవ్యశ్రీలకు నాట్య విధాత అవార్డులు ప్రదానం చేయనున్నారు. స్థానిక వైఎంహెచ్‌ఏ హాలులో ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు.
భీమవరం: తల్లిదండ్రులు మందలించారని రైలుకింద పడి బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు భీమవరం రైల్వే ఎస్‌ఐ ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. భీమవరం రూరల్ మండలం చినఅమిరం గ్రామానికి చెందిన మద్దాల శిరీష(17) ఇంటర్ చదువుతోంది. సక్రమంగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో గురువారం రాత్రి నరసాపురం నుంచి లింగంపల్లి వెళ్లుతున్న రైలుకిందపడి తీవ్రంగా గాయపడింది. లోకోపైలెట్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.
ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం గుర్తించారు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. పెద్ద రైల్వేస్టేషన్ పరిధిలోని వట్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పక్కనే గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతుడు శరీరం 40 శాతానికి పైగా కుళ్ళిన స్థితిలో ఉంది. మృతదేహంపై ఆరంజ్ రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ ఉంది. వయస్సు సుమారు 40 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉంటుందని అంచనా. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.