
మూలనపడ్డ ఎన్‌హెచ్–165 పనులు
త్వరగా నిర్మించాలి
ఇరుకు రోడ్లతో సతమతం
ఆకివీడు: జాతీయ రహదారి–165 నిర్మాణంలో భాగంగా స్థానిక ఉప్పుటేరుపై నిర్మించనున్న వంతెన పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. పామర్రు–ఆకివీడు, ఆకివీడు–దిగమర్రు జాతీయరహదారి నిర్మాణానికి అడుగడుగునా అవాంతరాలతో కాలం గడిచిపోతుంది. పీపీ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని 1999లో జాతీయ రహదారిగా గుర్తించి ఆ శాఖ విలీనం చేసుకుంది. అప్పటి నుంచి పాత రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టకపోయినా, తూట్లు పడ్డ ప్రాంతంలో మాట్లు వేసి ఎన్‌హెచ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రజలు, ప్రయాణికులు జాతీయరహదారిగా గుర్తింపు పొందిన తరువాత కొత్త రోడ్డు వేస్తారు.. రోడ్డు విస్తరణ జరుగుతుందని ఎంతో ఆశపడ్డారు. చివరకు నిరాశే మిగిలింది. ప్రస్తుతం ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న పామర్రు–ఆకివీడు ప్రాంతంలో రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ చాలా వరకూ పనులు పూర్తి చేశారు.
ఏలూరు జిల్లా తాడినాడ ప్రాంతంలోని ఉప్పుటేరు గట్టు నుంచి, ఆకివీడు మండలంలోని అయిభీమవరం గుండా బైపాస్ వెళ్లేందుకు ఉప్పుటేరుపై వంతెన నిర్మాణ పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభించారు. ఉప్పుటేరులో పిల్లర్ల నిర్మాణం వేగంగా చేపట్టారు. రెండు వేసవిలు పూర్తయిన తరువాత నిర్మాణ పనుల్ని అర్థంతరంగా మూసివేశారు. ఎక్కడ పిల్లర్లు అక్కడే ఉప్పుటేరులో తుప్పుపట్టిపోతున్నాయి. పామర్రు–ఆకివీడు మధ్య ప్రాజెక్టు పనులలో భాగంగా ఈ వంతెన నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని చెబుతున్నారు. పిల్లర్లకు ఉన్న ఇనుప రాడ్లు తుప్పు పడుతుండటంతో వంతెన నిర్మాణానికి మళ్ళీ పిల్లర్లు వేయాలా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
పాత రోడ్డుకు తెర
ఆకివీడు–దిగమర్రు మధ్య బైపాస్ రోడ్ల నిర్మాణంతో పాత రోడ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. బైపాస్ రోడ్లతో కలిపి 46 కిలోమీటర్ల మేర ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి మొదట్లో రూ.1,200 కోట్లు, ఆ తరువాత రూ.2,400 కోట్లు, ప్రస్తుతం రూ.3,100 కోట్ల నిధులు కేటాయించారు. పాత అలైన్‌మెంట్ ప్రకారం ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణానికి అంచనా రూ.2,400 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త అలైన్‌మెంట్ ప్రకారం మరో రూ.700 కోట్లు అదనంగా కేటాయించారు.
పాత రోడ్డుకు మోక్షం కల్పించండి
జాతీయ రహదారి 165 పాత రోడ్డుకు మోక్షం కల్పించేలా ఆ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. బైపాస్‌తో కొత్త రోడ్డు నిర్మాణానికి మరో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదని పలువురు పేర్కొంటున్నారు. పాతరోడ్డును నాలుగు లైన్లకు గానీ, కనీసం మూడు లైన్లకు గానీ విస్తరింపజేసి, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని పలువురు కోరుతున్నారు.
జాతీయ రహదారి విస్తరణ, నిర్మాణ పనులు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ప్రతిపాదనల రూపంలోనే ఉండిపోయింది. ప్రభుత్వాలు మారినా, ప్రజా ప్రతినిధులు మారినా ఎన్‌హెచ్–165 రూపురేఖలు మారడంలేదు. ప్రస్తుతం ఉన్న రోడ్డును అభివృద్ది చేయాలి.
– అంబటి రమేష్, ఆకివీడు
జాతీయ రహదారి–165 అభివృద్ధి జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నాము. వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ పెరిగిపోతుంది. జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా త్వరితగతిని అభివృద్ధి చేయాలి. బైపాస్ రోడ్లకు పనుల్ని వేగవంతం చేయాలి. నిత్యం ట్రాఫిక్‌తో సతమతమవుతున్నాం.
– కె.లాజరు, కుముదవల్లి, పాలకోడేరు మండలం

మూలనపడ్డ ఎన్‌హెచ్–165 పనులు

మూలనపడ్డ ఎన్‌హెచ్–165 పనులు