
22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ఈ ఏడాది ప్రత్యేకం
ద్వారకాతిరుమల: ఏటా తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగే శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడు 11 రోజుల పాటు జరగనున్నాయి. అందులో భాగంగా ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు జరగనున్న ఉత్సవాలను పురస్కరించుకుని ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన, క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం విద్యుద్దీప అలంకారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రహదారికి ఇరువైపులా విద్యుత్ తోరణాలు అమర్చుతున్నారు. ఆలయం వద్ద అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో అమ్మవారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు.
అలంకారాలు ఇవీ..
దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారు ఈనెల 22న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ గాయత్రీ దేవిగా, 24 న శ్రీ అన్నపూర్ణా దేవిగా, 25 న శ్రీ కాత్యాయని దేవిగా, 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 27న లలితా త్రిపుర సుందరీ దేవిగా, 28న మహాచండీగా, 29 న శ్రీ సరస్వతీ దేవిగా(మూలానక్షత్రం), 30 న శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. అలాగే వచ్చేనెల 1న మహిషాసురమర్దినిగా, ఉత్సవాల ముగింపు రోజైన(దసరా పండుగ) 2న శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని తెలిపారు. అదేరోజు సాయంత్రం క్షేత్రంలో అమ్మవారి రథోత్సవం, 3న దీక్షాధారుల ఇరుముడి సమర్పణ, చండీహోమాన్ని నేత్రపర్వంగా నిర్వ హిస్తామని పేర్కొన్నారు. 4న ఆలయం వద్ద భారీ అన్నసమారాధన నిర్వహిస్తామని తెలిపారు. ద్వారకాతిరుమలకు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ కుంకుళ్లమ్మ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తులకు యాత్రలో కష్టనష్టాలు కలుగనివ్వరని భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారిని దర్శించిన అనంతరం భక్తులు తిరుగు ప్ర యాణంలో తప్పనిసరిగా ఈ అమ్మవారిని దర్శిస్తారు.
ఆలయం వద్ద అమ్మవారి భారీ విద్యుత్ కటౌట్ నిర్మాణ పనులు
ద్వారకాతిరుమలలో క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ అమ్మ ఆలయం
శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది 11 రోజులు రావడం విశేషం. తిధుల్లో హెచ్చుతగ్గులు రావడమే ఇందుకు కారణం. ఉత్సవాలు జరిగే రోజుల్లో విజయవాడ దుర్గమ్మ ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారో, ఇక్కడ కుంకుళ్లమ్మ అమ్మవారు కూడా అదే అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
– భైరవ స్వామి, కుంకుళ్లమ్మ ఆలయ ప్రధాన్చాకుడు, ద్వారకాతిరుమల
ఈసారి 11 రోజుల పాటు వేడుకలు
ముస్తాబవుతున్న క్షేత్ర దేవత కుంకుళ్లమ్మ ఆలయం
రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు

22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు