అమృత్‌ పై నీలినీడలు | - | Sakshi
Sakshi News home page

అమృత్‌ పై నీలినీడలు

Sep 12 2025 4:47 PM | Updated on Sep 12 2025 4:47 PM

అమృత్

అమృత్‌ పై నీలినీడలు

టెండర్లకు చర్యలు ప్రాజెక్టు నిధులు, పనులు పట్టణాల వారీగా..

భీమవరం(ప్రకాశం చౌక్‌): పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు పట్టణాలకు సురక్షిత తాగునీటిని పుష్కలంగా అందించే అమృత్‌ 2.0 (అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువెనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌) మంచినీటి సరఫరా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఆకివీడు మున్సిపాలిటీల్లో శివారు ప్రాంతాలకు సైతం రెండు పూటలా మంచినీటిని అందించి శాశ్వతంగా తాగునీటి సమస్య లేకుండా చేసే బృహత్తర ప్రాజెక్టు పనులు నత్తనడక కంటే దారుణంగా సాగుతున్నాయి. మొదట అమృత్‌ 2.0 ప్రాజెక్టుకు రూ.286.54 కోట్లు మంజూరు చేయగా 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ధేశించారు. దీంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమృత్‌ 2.0 ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌లు సైతం పూర్తి చేసి టెండర్లు ప్రక్రియ వరకు తీసుకువెళ్లింది. అనంతరం సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారిపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రాజెక్టు వ్యయం రూ.770.85 కోట్లతో భారీ ప్రాజెక్టుగా మార్చింది.

15 నెలలుగా ముందుకు కదలడం లేదు

పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా జరిగే ఈ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందడం లేదని సృష్టంగా తెలుస్తోంది. గత 15 నెలలుగా ఒక పనికి కూడా టెండర్‌ వరకు అమృత్‌ 2.0 ముందుకు వెళ్లలేదు. ఆరు పట్టణాల్లో ఎక్కడ కూడా ఇప్పటివరకు ఒక పనికి కూడా టెండర్లు ఖరారు కాలేదు. పూర్తిగా డీపీఆర్‌లు కూడా తయారీ కాలేదు. జిల్లాలో ముఖ్యమైన పట్టణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యంలో చేపట్టాల్సిన మంచినీటి ప్రాజెక్టు గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు సైతం ప్రభుత్వ బాటలోనే పయనిస్తూ ప్రాజెక్టు పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దృష్టి సారించని కేంద్ర మంత్రి

జిల్లా కేంద్రమైన భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నా కేంద్ర ప్రాజెక్టు అమృత్‌ 2.0పై శ్రద్ధ వహించడం లేదు. ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టుపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పటివరకు జిల్లాలోని ఆరు పట్టణాలకు సంబంధించిన ఏ ఎమ్మెల్యే గానీ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు గానీ అమృత్‌ 2.0 గురించి అధికారులను కనీసం ఆరా తీసిన దాఖలా లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఆయా పట్టణాల్లో చివరి ప్రాంతాల ప్రజలు మంచినీళ్లు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, అలాగే కొన్ని మున్సిపాలిటిల్లో విలీన గ్రామాలు కూడా భవిష్యత్‌లో కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పెరిగే జనాభా దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అమృత్‌ 2.0 ప్రాజెక్ట్‌కు సంబంధించి మారిన షెడ్యూల్‌ రేట్ల ప్రకారం డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లకు చర్యలు తీసుకుంటున్నాం.

– ఆర్‌.విజయ్‌

జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ శాఖ అధికారి

అమృత్‌ 2.0 ప్రాజెక్టు నిధులు ఆరు పట్టణాలకు రూ. 770.85 కోట్లు కాగా అందులో ముఖ్యమైన పనుల్లో విజ్జేశ్వరం నుంచి ఆరు పట్టణాలకు వాటర్‌ గ్రిడ్‌ పైపులైన్‌, మొత్తం 12 ఓహెచ్‌ఆర్‌లు (వాటర్‌ ట్యాంకులు), ఎస్‌టీపీలు 2 (మురికినీళ్లు శుద్ధిచేసే ప్లాంట్లు), ఫిల్టరేషన్‌ ప్లాంట్లు 3, సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ఉన్నాయి.

భీమవరం రూ.167.72 కోట్లు

విజ్జేశ్వరం నుంచి 54 కీలోమీటర్లు మేర వాటర్‌ గ్రిడ్‌ ద్వారా పైపులైన్‌ వేయడం, పట్టణంలో మంచినీటి సరఫరా కోసం పైపులైన్లు, ఇతర వాటర్‌ సరఫరా పనులు.

తాడేల్లిగూడెం రూ.163.50 కోట్లు

సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు, ఓహెచ్‌ఆర్‌ 1, ఎస్‌టీపీలు 2, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, పైపులైను పనులు

నరసాపురం రూ.125.92 కోట్లు

ఓహెచ్‌ఆర్‌లు 3, ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ 1, సంపులు, పైపులైన్ల పనులు

పాలకొల్లు రూ.119.26 కోట్లు

వాటర్‌ పైపులైన్లు, ఇతర వాటర్‌ సరఫరా పనులు

తణుకు రూ 118.119 కోట్లు

ఓహెచ్‌ఆర్‌లు 4,

ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ 1, పైపులైన్ల పనులు

ఆకివీడు రూ.76.34 కోట్లు

ఓహెచ్‌ఆర్‌లు 4, ఫిల్టరేషన్‌ ప్లాంట్‌ 1, పైపులైన్ల పనులు

కూటమి అలసత్వం

జిల్లాలో ఆరు పట్టణాలకు సంబంధించి మంచినీటి సరఫరా ప్రాజెక్టు

డీపీఆర్‌లు సిద్ధం చేసిన గత ప్రభుత్వం

టెండర్ల దశలో సార్వత్రిక ఎన్నికలు

15 నెలలుగా కూటమి హయాంలో పట్టాలు ఎక్కని ప్రాజెక్టు పనులు

అమృత్‌ పై నీలినీడలు 1
1/1

అమృత్‌ పై నీలినీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement