
ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ
భీమవరం: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై పౌర సరఫరాలు, వ్యవసాయ, సహకార, రవాణా శాఖలు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదటి వారంలో తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
పెనుగొండ: ములపర్రులో మద్యం ధరలను ఇష్టారాజ్యంగా వసూలు చేస్తుండడంపై మద్యం ప్రియులు గురువారం దుకాణం వద్ద నిరసన తెలిపారు. మద్యం ధరలు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. సమయానుకూలంగా ధరలు మారుస్తున్నారంటూ విమర్శించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తే ధర ఇంతేనంటూ వెటకారంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ధరలు తగ్గించకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీర్‌గా రమేష్ గరువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ రాజ్ విభాగం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు.
తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో పండిన కర్నూలు ఉల్లిపాయలను వినియోగించి రైతులకు బాసటగా నిలవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. గురువారం తాడేపల్లిగూడెంలో మార్కెట్‌లో ఉల్లిపాయల క్రయ విక్రయాలను ఆమె పరిశీలించారు. పరిస్థితిపై కలెక్టర్ రైతులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కర్నూలు ఉల్లిపాయలతో వంట చేయించి, వ్యాపారులు, రైతులతో కలిసి కలెక్టర్ అక్కడే భోజనం చేశారు. షోలాపూర్ ఉల్లి కన్నా, కర్నూలు ఉల్లి ఎంతో రుచికరం అని, జిల్లా ప్రజలు, విద్యాసంస్థలు కర్నూలు ఉల్లినే వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకొనేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందన్నారు. గురువారం వచ్చిన ఉల్లిపాయలకు కిలోకు రూ.6 వచ్చాయని రైతు తెలుపగా, కలెక్టర్ కోరిక మేరకు రూ.9 వంతున చెల్లించడానికి వ్యాపారులు అంగీకరించారు. విద్యాసంస్థల్లో, మార్టుల్లో కర్నూలు ఉల్లిపాయల విక్రయాలు చేపట్టడానికి చర్యలు తీసుకున్నట్టు ఆమె చెప్పారు. మార్కెటింగ్ రీజినల్ జేడీ.కె.శ్రీనివాసరావు, ఏడీ సునీల్‌కుమార్, తహసీల్దార్ సునీల్, కమిషనర్ ఎం. ఏసుబాబు, తదితరులు ఉన్నారు.
టి.నరసాపురం: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా మార్గాల్లో గురువారం వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని మక్కినవారిగూడెం – టి.నరసాపురం మార్గంలో కనకదుర్గ గుడి వద్ద జలవాగు, బండివారిగూడెం – మక్కినవారిగూడెం గ్రామాల మద్య గల ముగ్గురాళ్ళ వాగు, అప్పలరాజుగూడెం – మధ్యాహ్నపువారిగూడెం గ్రామాల మధ్య ఎర్రకాలువ వాగులు భారీ వర్షం కారణంగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.