కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి | - | Sakshi
Sakshi News home page

కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి

Sep 12 2025 4:47 PM | Updated on Sep 12 2025 4:47 PM

కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి

కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి

కర్నూలు ఉల్లి.. రైతులు తల్లడిల్లి

వ్యాపారులు కొనడం లేదు

తాడేపల్లిగూడెం: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక కర్నూలు ఉల్లి రైతులు తల్లడిల్లుతున్నారు. రాష్ట్రంలోనే ప్రధానమైన తాడేపల్లిగూడెం మార్కెట్‌కు కర్నూలు ఉల్లి లారీలు వస్తున్నా తేమశాతం, నాణ్యత లేమితో వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. ప్రభుత్వ సాయం అందక, అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో నెల రోజులుగా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉల్లి బస్తాలను రోడ్ల పక్కన వదిలేస్తూ నిట్టూరుస్తున్నారు.

70 ఏళ్లుగా ఇక్కడికే.. రాష్ట్రంలోని ఉల్లి అవసరాన్ని మహారాష్ట్ర ఉల్లి తర్వాత కర్నూలు, కడప ఉల్లి తీరుస్తుంది. ఖరీఫ్‌, రబీ సీజన్లలో వేలాది ఎకరాల్లో ఉల్లి పండించడంతో పాటు అధిక శాతం పంటను 70 ఏళ్లుగా ప్రధాన మార్కెట్‌గా ఉన్న తాడేపల్లిగూడేనికి రైతులు తీసుకొస్తున్నారు. ఇక్కడ బస్తా బస్తా గ్రేడింగ్‌ చేసి ధర నిర్ణయిస్తారు. బహిరంగ వేలంలో ఉల్లిని విక్రయిస్తారు. అదే రోజు రైతుల చేతికి సొమ్ములు అందుతాయి. కర్నూలు మార్కెట్‌ దీనికి భిన్నం కావడంతో ఈ రకం గూడెం మార్కెట్‌కే ఎక్కువగా వస్తుంది. ఇది చాలా కాలంగా వ్యాపార బంధంగా కొనసాగుతోంది. అక్కడి ఉల్లి రైతులకు కష్టం వచ్చినా కూడా ఆదుకొనేది తాడేపల్లిగూడెం వ్యాపారులే కావడం విశేషం.

విస్తీర్ణం తగ్గినా.. ధర లేదు

కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం క్రమేపీ తగ్గుతోంది. 2019–20లో 33,829 ఎకరాల్లో సాగు చేయగా 7.78 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2024–25లో 19,546 ఎకరాల్లో సాగు చేయగా 3.51 లక్షల టన్నులకు దిగుబడి అంచనా వేశారు. ఎకరాకు రైతుకు రూ.70 వేలు ఖర్చవుతుంది. కనీస దిగుబడి 50 క్వింటాళ్లు రావాలి. అలాగే ధర క్వింటాలు రూ.2 వేలు పలికితేనే రైతు గట్టెక్కుతారు. అయితే ఈ ఏడాది ధరలు దారుణంగా పడిపోయాయి. కిలోకు రూ.4 రావడం గగనంగా మారింది. నాణ్యత ఉంటే రూ.9 వరకు వస్తుంది. కిలో గరిష్ట ధరను రూ.11గా నిర్ణయించారు. దీంతో రైతులు ఉల్లిని మార్కెట్లకు తెస్తున్నారు. వాటిని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసి తర్వాత ప్రధాన మార్కెట్‌కు పంపిస్తోంది.

నాలుగు రోజుల తర్వాత గూడెంకు..

మహారాష్ట్ర ఉల్లితో పోలిస్తే కర్నూలు ఉల్లిలో నాణ్యత తక్కువ. మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన వెంటనే పంటను మార్కెట్లు తరలించాల్సి ఉండగా అలా జరగడం లేదు. ఉల్లిని కర్నూలు మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేసి, నెట్టులు కట్టి నాలుగు రోజుల తర్వాత తాడేపల్లి గూడెం మార్కెట్‌కు పంపిస్తున్నాయి. వాస్తవానికి ఉల్లి లారీ 30 నుంచి 35 టన్నులు ఉంటుంది. నాసిరకం, కుళ్లిపోయే గుణం కర్నూలు ఉల్లిని పది టన్నులకు మించి పంపకూడదు. సామర్థ్యానికి మించి పంపితే ఆవిరి పెరిగి, పై బస్తాలు కింద బస్తాలను నొక్కడంతో ఉల్లిపాయలు మరింత రసం కారేలా తయారవుతున్నాయి. దీంతో ఈ రకం మార్కెట్‌కు వచ్చినా ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో రోడ్లపై పడేసే పరిస్థితి వచ్చింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ పేరుతో ఏటా రూ.3 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించి రైతులకు పంటల విషయంలో సమస్య వచ్చినప్పుడు కనీస ధర ఇచ్చి ఆదుకునేది. ప్రస్తుత కూటమి పాలనలో ఈ పరిస్థితి లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు.

తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చే కర్నూలు ఉల్లిలో నాణ్యత లేకపోవడంతో వ్యాపారులు కొనడం లేదు. ఇంకా మహారాష్ట్ర ఉల్లిపాయలు వస్తున్నాయి. మహారాష్ట్రలో కూడా 60 శాతం పంట ఉంది. సాధారణంగా కర్నూలు ఉల్లి సీజన్‌లో రోజుకు 80కు పైగా లారీలు గూడెం మార్కెట్‌ వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఏడెనిమిది లారీలు మాత్రమే వస్తున్నాయి. కడప, మైదుకూరు ప్రాంతాల నుంచి వచ్చే రకంలో కాస్త నాణ్యత ఉంటుండగా.. కర్నూలు రకం ఇక్కడకు వచ్చేసరికి కుళ్లిపోతున్నాయి. దీంతో కిలో రూ. 2 కు కూడా కొనడం లేదు. వాటిని దుకాణాల్లో ఉంచుకోలేం. దీంతో వ్యాపారులు తాము తీసుకునే కమీషన్‌ సొమ్ములను రైతుల నుంచి తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు ఉల్లి రైతులకు న్యాయం చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. – ఎన్‌కే, ఉల్లి వ్యాపారి

గిట్టుబాటు ధర లేని వైనం

నాణ్యతలేమి, తేమ శాతంతో ఇబ్బందులు

ఆదుకోని కూటమి సర్కారు

నలిగిపోతున్న ఉల్లి రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement