
అటవీ అమరవీరులకు నివాళి
భీమవరం: అటవీ, వన్యప్రాణి సంరక్షణ కోసం అశువులు బాసిన అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని అటవీ సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖాధికారి డీఏ కిరణ్ అన్నారు. గురువారం జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయంలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో మృతి చెందిన రాజమహేంద్రవరానికి చెందిన ఫారెస్ట్ అధికారి పందిరిపల్లి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భీమవరం రేంజ్ అటవీ క్షేత్రాధికారి మురాల కరుణాకర్ మాట్లాడుతూ 1730 సెప్టెంబర్ 11న రాజస్థాన్ రాష్ట్రం జోదపూర్‌లో అటవీ సంరక్షణకు సుమారు 363 మంది బలిదానం కావడంతో మహారాజా అభయ్ సింగ్ పశ్చాత్తాపంతో అటవీ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ జాతీయ అటవీ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారని చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ భారతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్‌కుమార్, బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ పోచమ్మ పాల్గొన్నారు.