
సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త నిరసనలు
సచివాలయ ఉద్యోగుల హెచ్చరిక
యలమంచిలి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, మండలంలో మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు సచివాలయ ఉద్యోగులు అధికారిక నోటీసులు అందజేశారు. ఈ మేరకు యలమంచిలి మండల ఉద్యోగులు ఈఓపీఆర్డీ జేడీవీ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇంటింటికీ తిరుగుతూ చేసే సర్వేల నుంచి సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలని, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులను వారి సంబంధిత మాతృశాఖలకే అనుసంధానం చేయాలని, సమయపాలన లేకుండా ఆదివారాలు, పండుగలు, సెలవులు, అర్ధ రాత్రుల్లో బలవంతపు విధులు చేయించడం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, ఆరేళ్లుగా ఒకే క్యాడర్‌లో కొనసాగుతున్న వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ప్రస్తుత రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్‌ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్‌గా మార్పు చేయాలని, జిల్లాల వారీగా సీనియారిటీ జాబితాలు విడుదల చేయాలని, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలకు ప్రత్యేక విధి విధానాలు రూపొందించాలని వారు అధికారిక నోటీసులో పేర్కొన్నారు.