
సీసలిలో ఉద్రిక్తత
కాళ్ల: కాళ్ల మండలం సీసలిలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామ దేవత గుడి పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయంలో వివాదం తలెత్తగా.. ఇరువర్గాల దాడిలో పలువురు గాయపడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీసలి హరిజన పేటకు చేర్చి కాలువ ఒడ్డున తాడిచెట్టు ఉండగా, అక్కడ కొన్ని సంవత్సరాలుగా పోలేరమ్మకు పూజలు చేస్తున్నారు. జూన్‌లో అదే ప్రాంతంలో పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుడికి పక్కనే కొంత స్థలం ఉంది. ఈ స్థలాన్ని స్థానిక దళితులు అంబేడ్కర్ జయంతి రోజున భోజనాలు వండేందుకు వాడుకునేవారు. ఈ స్థలంలోనే పోలేరమ్మ గుడికి సంబంధించిన ఉత్సవాలు జరిగినప్పుడు భోజనాలు పెట్టుకునేందుకు షెడ్డు కట్టాలనే ఆలోచనను స్థానిక దళితులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఇరువురి పెద్దలు మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. కొందరు సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లి స్థలాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేశారు. ఫెన్సింగ్ తొలగించే క్రమంలో అంబేద్కర్ ఫ్లెక్సీ పాడయింది. విషయం తెలిసి దళితులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.