
బైబిల్ విరుద్ధమైన బోధనలు అడ్డుకుంటాం
పాలకొల్లు సెంట్రల్: బైబిల్‌కు విరుద్ధమైన బోధనలు చేసే వారిని అడ్డుకుంటామని తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎస్.ఎబినేజర్ అన్నారు. శుక్రవారం పట్టణ శివారు అడబాల గార్డెన్స్‌లో జరుగుతున్న క్రైస్తవ తెలాభిషేకం ఆరాధన కార్యక్రమాన్ని పాలకొల్లు తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గార్డెన్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కొంత కాలంగా ప్రార్థనా శక్తి నిర్వాహకుడు ఇస్సాక్ అడబాల గార్డెన్స్‌లో ప్రతి నెలా మొదటి శుక్రవారం తైలాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ స్థానిక తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచి నిరసన చేపట్టారు. సంఘ అధ్యక్షుడు ఎబినేజర్ మాట్లాడుతూ అమాయక ప్రజలను, విశ్వాసులను మభ్యపెట్టి ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. ఆరాధన ఆదివారం మాత్రమే జరగాలని.. అలా కాకుండా ఏ రోజైనా చేస్తే వాక్యానికి విరుద్ధమన్నారు. తైలాభిషేకం బైబిల్‌లో ఎక్కడా లేదని, అందువల్ల ఈ బోధనను ఖండించేందుకు నిరసన చేపట్టామన్నారు. బోధకుడు ఇస్సాక్ అనుచరులు వచ్చి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పారని.. అయితే కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదన్నారు.