తాడేపల్లిగూడెం: జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై మంగళవారం విజిలెన్స్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలో విజయ ట్రేడర్స్, వెంకటేష్ మెన్యూర్ డిపో, చాట్రాయి మండలం చనుబండలో లక్ష్మీ వెంకటేశ్వర మెన్యూర్స్ అండ్ జనరల్ స్టోర్సు, డెక్కన్ ఆగ్రో కెమికల్స్‌పై దాడులు చేశారు. దుకాణాల్లో ఉన్న స్టాకునకు, వాస్తవ స్టాకునకు వ్యత్యాసాలు గుర్తించారు. సుమారు రూ.10 లక్షల 80 వేల 762 విలువ కలిగిన 53.565 టన్నుల ఎరువులు తేడా ఉన్నట్టు గమనించారు. ఈ మేరకు ఆ ఎరువులను సీజ్ చేసి, దుకాణ యజమానులపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం 6ఏ కేసులు నమోదు చేశారు. దాడుల్లో రీజినల్ విజిలెన్స్ ఎన్‌పోర్సుమెంటు అధికారి పి.మహేష్, విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ పి.శివరామకృష్ణ, ఏఓ జి.మీరయ్య, ఎస్సై సీహెచ్ రంజిత్‌కుమార్, కె.సీతారాము, చాట్రాయి, గూడెం వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
కారులో ఆకస్మికంగా మంటలు
ఏలూరు టౌన్: ఏలూరు అమీనాపేటలో మంగళవారం రాత్రి ఒక కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఏలూరు మంచినీళ్ళతోట ప్రాంతానికి చెందిన కురెళ్ళ సుబ్బారావుకి చెందిన కారులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు యజమాని కుమారుడు వివేక్ ప్రయాణిస్తున్నాడు. అశోక్‌నగర్ వైపు నుంచి కారులో వెళుతూ ఉండగా అమీనాపేట సోనోవిజన్ షోరూమ్ సమీపానికి వచ్చే సరికి కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఏలూరు అగ్నిమాపక అధికారి రామకృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇంజన్ భాగం పూర్తిగా దగ్ధమైంది.
20 కాసుల బంగారం చోరీ
పాలకొల్లు సెంట్రల్: పెళ్లి ఇంట్లో బంగారు ఆభరణాల చోరీపై కేసు నమోదైంది. మండలంలోని ఉల్లంపర్రు గ్రామంలో పెన్మెత్స సుబ్బరాజు ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. వివాహ వేడుక అనంతరం చూసుకోగా హారం, నల్లపూసలు, గొలుసు, తెలుపు గులాబి రంగు రాళ్ల ముత్యాల నక్లీసు, బంగారు గాజులు, దుద్దులు మొత్తం దాదాపుగా 20 కాసుల వరకూ బంగారు ఆభరణాలు పోయినట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇంటిలో ఓ వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు సుబ్బరాజు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్సై బి. సురేంద్రకుమార్ తెలిపారు.

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు