
మద్దిలో పవిత్రోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం : గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో సోమవారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో తొలి రోజు ఆంజనేయస్వామి వారికి విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనము, మృత్సంగ్రహణ, అంకురార్పణ, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అగ్నిప్రతిష్ట, అకల్మష హోమాలు, ఏతత్ ప్రధాన హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. అలాగే రెండవ రోజు మంగళవారం నిత్యకై ంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈవో చెప్పారు.
చింతలపూడి : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర కౌన్సిలర్ కంచర్ల బుచ్చిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో సోమవారం చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. చలో విజయవాడకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు (టూటౌన్): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ నెల మూడో తేదీన ఏలూరు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విక్రమ్ కిషోర్ సోమవారం విలేకరులకు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 నుంచి సాయంత్రం వరకు ఏలూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం నాలుగు గంటలకు మీడియాతో ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పారు.
కొయ్యలగూడెం: ద్విచక్ర వాహనంతో చెట్టును ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నాపురం గ్రామ శివారున సోమవారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపుడి సత్యనారాయణ (60) ద్విచక్రవాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ కన్నాపురం శివారు వచ్చేసరికి చెట్టును ఢీకొన్నారు. దీంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సత్యనారాయణ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

మద్దిలో పవిత్రోత్సవాలు ప్రారంభం