పశువధకు ఎమ్మెల్యే రాధాకృష్ణే సూత్రధారి | - | Sakshi
Sakshi News home page

పశువధకు ఎమ్మెల్యే రాధాకృష్ణే సూత్రధారి

Jan 3 2025 12:40 AM | Updated on Jan 3 2025 7:02 PM

-

మాజీ మంత్రి కారుమూరి ధ్వజం 

తణుకు అర్బన్‌: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పశువధ కర్మాగారం నుంచి అందిన డబ్బుకు దాసోహం కావడంతోనే మండలంలోని తేతలిలో లాహం ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ అక్రమంగా పశువధ నిర్వహిస్తోందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డబ్బుకు లొంగిపోయిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఓట్లేసి గెలిపించిన మహిళలను రోడ్డుపై కూర్చోబెట్టి వారి జీవనాన్ని హరించారని విమర్శించారు. 

2014 నుంచి 2019 లోపు ఫ్యాక్టరీ నిర్మా ణానికి అనుమతులు, సివిల్‌ పనులు, సాంకేతిక సామర్థ్యాన్ని ఏర్పాటుచేసుకున్నామని, కూటమి ప్రభుత్వం ఫ్యాక్టరీ ద్వారా వ్యాపారాన్ని పెంచాలని, తద్వారా రెవెన్యూ వస్తుందని, ఉపాధి పెరుగుతుందని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నట్టు ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ ప్రకటించారని విమర్శించారు. ఇళ్లలో ఉండలేకపోతున్నామని, పిల్లలు అనారోగ్యాల పాలవుతున్నామంటూ మహిళలు ఆవేదన చెందుతున్నా ఎమ్మెల్యేకు పట్టడం లేదన్నారు. పంచాయతీ అనుమతి లేకుండా ఏ గ్రామంలో కూడా ప్రైవేటు ఫ్యాక్టరీలు నడిచే వ్యవస్థ లేదని చట్టాలు చెబుతున్నా కనీసం ఆ జ్ఞానం కూడా ఎమ్మెల్యేకు లేకపోవడం శోచనీయమని అన్నారు. 

ఆరు నెలల్లోనే మీ నిజ స్వరూపం ప్రజలకు అర్థమయ్యిందని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా పశువధ జరిగిందని తప్పుడు పత్రాలు పుట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, కర్మాగారంలో ఎప్పుడు వధ జరిగిందో కరెంటు బిల్లులే నిదర్శనమని, జీఎస్టీ బిల్లులు కూడా తమ వద్ద ఉన్నాయని కారుమూరి అన్నారు. నాకు దమ్ము, ధైర్యం ఉన్నాయి కాబట్టే గతంలో ఫ్యాక్టరీని మూయించానని, మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు మాయించాలని ఆరిమిల్లికి సవాల్‌ విసిరారు. చంద్రబాబు కుయుక్తులతో గద్దెనెక్కారని, ఎమ్మెల్యే ఆరిమిల్లి ధోరణి కూడా అలానే ఉందని కారుమూరి అన్నారు. ఆనాడు నాకు ఫ్యాక్టరీలో వాటా ఉందని అబద్దాలు వండివార్చారని, ఇప్పుడు తాను అడుగుతున్నా ఫ్యాక్టరీలో మీకు, మీ కుమారుడికి వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తణుకు నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఆర్‌కే ట్యాక్స్‌ చెల్సించాల్సిదేనని ప్రజలు అంటున్నారని కారుమూరి విమర్శించారు.

పోరాటం ఆగదు
తేతలి గ్రామస్తుల కోసం అఖిలపక్షం, వివిధ సంఘాల తరఫున రానున్న రోజుల్లో పశువధపై ఉద్యమం చేయనున్నామని కారుమూరి అన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా పోరాటం ఆగదన్నారు.

అనుమతులు సక్రమంగా లేవు
లాహం ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చూపిస్తున్న అనుమతులన్నీ అక్రమమని గోసేవా సమితి సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. ప్రభుత్వ అండతో అధికారులు చట్టాన్ని మీరి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తణుకు తహసీల్దార్‌, రూరల్‌ సీఐ వ్యవహారం కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు. తాము చేపట్టిన నిరసన శిబిరం టెంట్లు తొలగించడంతో పాటు సామగ్రిని స్వాధీ నం చేసుకోవడం చట్టవ్యతిరేకమన్నారు. 

ఇందుకు సహకరించిన అధికారులపై కేసులు పెట్టనున్నట్టు చెప్పారు. బాధిత మహిళలు మాట్లాడుతూ పరిశ్రమ వద్ద గత ఐదేళ్లలో ఎప్పుడూ దుర్వాసన రాలేదని, రెండు నెలలుగా దుర్వాసన రావడంతో ఆందోళనలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సెక్రటరీ ఆర్గనైజేషన్‌ యిండుగపల్లి బలరామకృష్ణ, గోసేవా సమితి సభ్యుడు జల్లూరి జగదీష్‌, పార్టీ నాయకులు వి.సీతారాం, మెహర్‌ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement