ఖిలా వరంగల్: తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సద్దుల బతుకమ్మ, విజయదశమి (దసరా) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ సూచించారు. మంగళవారం వరంగల్ కరీమాబాద్‌లోని ఉర్సు గుట్ట రంగలీల మైదానంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సీపీ శ్వేత, బల్దియా కమిషనర్ టి.వెంకన్న ఉత్సవ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, మెడిది మధుసూదన్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఉత్సవాలకు బతుకమ్మ మైదానాలు, ఉర్సు రంగలీల మైదానాన్ని చదును చేయాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్యసేవలు, తాత్కాలిక మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. దసరా సందర్భంగా రంగలీల మైదానంలో నిర్వహించే వేడుకలకు సుమారు 3 లక్షల మంది రానున్నారని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సౌండ్ నియంత్రణ నిబంధనలు పాటిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. సీపీ శ్వేత మా ట్లాడుతూ బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ట్రాఫిక్ జామ్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ఉత్సవ కమిటీకి సహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిషోర్‌కుమార్, వైవీ గణేష్, డీసీపీ కవిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీ సాల ప్రకాశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మీ, ఆర్డీఓ సుమ, డీసీపీ సలీమా, తహసీల్దార్ ఇక్బాల్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షులు గోనే రాంప్రసాద్, గౌరవ అధ్యక్షుడు గోపాల నవీన్‌రాజు, వడ్నాల నరేందర్, కోటేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
కుడా చైర్‌పర్సన్ గైర్హాజరు
కాగా రంగలీల మైదానంలో ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల సమీక్ష సమావేశానికి కుడా చైర్‌పర్సన్ గుండా సుధారాణితో పాటు కుడా అధికారులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారు ఎందుకు హాజరు కాలేదన్న దానిపై అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడి కాలేదు. రాజకీయ విభేదాలతోనే హాజరు కాలేదన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది.
మాజీ మంత్రి కొండా సురేఖ
ఏర్పాట్లపై అధికారులతో
సమీక్ష సమావేశం


