జిల్లాలో అత్యధిక బకాయిలు ఉన్న రైస్‌మిల్లులు
సీఎంఆర్ బకాయిలపై
డిఫాల్ట్ రైస్‌మిల్లర్లపై చర్యలకు సిద్ధం
సాక్షి, వరంగల్: జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలపై పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలకు పూనుకుంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్‌ను ఏళ్లుగా నిల్వ ఉంచిన మిల్లులపై చట్టపరమైన చర్యలను వేగవంతం చేసింది. జిల్లాలో సీఎంఆర్ ఇవ్వాల్సిన 100 రైస్ మిల్లుల్లో 91 మిల్లులు పూర్తిస్థాయిలో బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించగా, మరో తొమ్మిది మిల్లులు మాత్రం ఇప్పటికీ బకాయిలను చెల్లించలేదు. వీటి వద్ద 3,307.336 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్‌లో ఉండగా, దీని విలువ సుమారు రూ.8.53 కోట్లుగా ఉంది. 2023–24 ఖరీఫ్ సీజన్ నుంచి కొనసాగుతున్న ఈ బకాయిలపై పలుమార్లు గడువు ఇచ్చినా.. స్పందించకపోవడంతో అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జిల్లాలో రెండు మిల్లుల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయడంతో మిగిలిన మిల్లర్లలో ఆందోళన నెలకొంది.
పలు మిల్లులపై ఎఫ్‌ఐఆర్ నమోదు..
కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు ఉన్న తొమ్మిది మిల్లులకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు మిల్లులపై ఎఫ్‌ఐఆర్లు నమోదు చేశారు. బకాయిలు ఉన్న అన్ని మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం బకాయిల వసూళ్ల ప్రక్రియను ప్రారంభించారు. మూడేళ్లుగా ఇదే మిల్లులపై విడతల వారీగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో తొమ్మిది మిల్లుల్లో రూ.8.53 కోట్ల విలువైన బియ్యం పెండింగ్
నోటీసులు, ఎఫ్‌ఐఆర్లు,
బ్లాక్‌లిస్ట్‌లో మిల్లులు
రెవెన్యూ రికవరీతో వసూళ్లకు అధికారుల కఠిన చర్యలు
జిల్లాలో సీఎంఆర్ బకాయిల పరిస్థితి
సీఎంఆర్ ఇవ్వాల్సిన మిల్లులు: 100
పూర్తిగా సీఎంఆర్ ఇచ్చిన మిల్లులు: 91
బకాయి ఉన్న మిల్లులు: 9
పెండింగ్ సీఎంఆర్: 3,307.336
మెట్రిక్ టన్నులు
బకాయి విలువ: రూ.8.53 కోట్లు
నోటీసులు జారీ: 9 మిల్లులు
ఎఫ్‌ఐఆర్లు నమోదు : 4 మిల్లులు
కఠిన చర్యలు తీసుకుంటాం..
మూడు సంవత్సరాలతో పోలిస్తే జిల్లాలో సీఎంఆర్ బకాయిల పరిస్థితి మెరుగుపడింది. అధిక శాతం మిల్లులు తమ బాధ్యతలను పూర్తి చేయగా, కేవలం తొమ్మిది మిల్లులు మాత్రమే బకాయిలతో మిగిలాయి. డిఫాల్టర్ల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగాం. ప్రభుత్వ ధాన్యం సకాలంలో బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థకు చేరేలా చూడటం మిల్లర్ల బాధ్యత. సీఎంఆర్ బకాయిలు చెల్లించని మిల్లులపై రెవెన్యూ రికవరీతో పాటు అవసరమైతే మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
–సంధ్యారాణి,
పౌరసరఫరాల జిల్లా మేనేజర్
మండలం గ్రామం మిల్లు పేరు
నెక్కొండ చంద్రుగొండ శ్రీవెంకటేశ్వర రైస్ మిల్,
శ్రీ మల్లికార్జునస్వామి ఇండస్ట్రీస్
ఖిలావరంగల్ బొల్లికుంట సౌభాగ్య రైస్ మిల్
ఖిలావరంగల్ గాడిపల్లి శ్రీ వైష్ణవి ఇండస్ట్రీస్
సంగెం కాపులకనపర్తి సతీష్ రైస్ మిల్


