వరంగల్ స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్‌లో ప్రవేశాలకు సోమవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. జేఎన్ స్టేడియంలో కొనసాగిన ఎంపికలకు వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఎంపికలు కొనసాగుతాయని హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ తెలిపారు. జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 250 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ ఎంపికల ప్రక్రియను సాట్ అబ్జర్వర్లు సతీశ్‌రెడ్డి, జిమ్నాస్టిక్స్ కోచ్ దీపక్ ప్రసాద్, హ్యాండ్‌బాల్ కోచ్ సుధాకర్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ సంతోశ్‌చారి పర్యవేక్షించారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు, డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.


