సర్‌.. 86,740 మంది లేరు | - | Sakshi
Sakshi News home page

సర్‌.. 86,740 మంది లేరు

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

సాక్షి, వరంగల్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ డిజిటలైజేషన్‌ 85.92 శాతం కాగా.. మరోవైపు 1,48,515 ఓట్ల వ్యత్యాసాలు (19.12 శాతం) నమోదవడం ఎన్నికల యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఇంటింటికి పంపిణీ చేసిన ఫారాలు తిరిగి రాకపోవడం, చిరునామా మార్పులు, గైర్హాజరు ఓటర్లు, మరణించిన వారి వివరాలు, ఇతర కారణాలను అధికారులు గుర్తించారు. తుదిఓటర్ల జాబితా సిద్ధం చేసే ముందు వీటిని క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు, ఈఆర్‌ఓలు పరిశీలించి పరిష్కరించనున్నారు. డిజిటలైజేషన్‌ పూర్తయ్యాక అధికారులకు అసలు పని ప్రారంభంకానుంది.

క్షేత్రస్థాయిలో సమస్యలు ఇవీ..

● జిల్లాలో మొత్తం 7,76,953 మంది ఓటర్లు ఉన్నారు. 86,740 ఫారాలు (11.16 శాతం) ఇంటింటి నుంచి తిరిగి సేకరించలేకపోయారు. జిల్లాలో నమోదైన వ్యత్యాసాల్లో ఇవే అత్యధికంగా ఉండడం అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇళ్లకు వెళ్లిన సమయంలో ఓటర్లు అందుబాటులో లేకపోవడం, వలస వెళ్లడం, చిరునామా మారడం, ఇళ్లు తాళాలు వేసి ఉండడం వంటి కారణాలతో ఫారాలు తిరిగి తీసుకోలేకపోయామని బీఎల్‌ఓలు చెబుతున్నారు.

● ఏఎస్‌డీ (ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌) కారణాలతో 6,690 మంది ఓటర్ల వివరాలు ప్రత్యేక పరిశీలనలో ఉన్నాయి. వీరిపై క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ చేసి, అవసరమైన ఆధారాలు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. బీఎల్‌ఓలు ఇంకా ధ్రువీకరించిన ఫారాలు 291 ఉన్నాయి. బ్లాక్‌లిస్ట్‌లో ఇప్పటివరకు 29 మందిని చేర్చారు.

● జిల్లా ఎన్నికల యంత్రాంగం 44,557 కేసులను (5.73 శాతం) ప్రత్యేకంగా గుర్తించింది. ఒకే కుటుంబంలో వివరాల వ్యత్యాసాలు, చిరునామా సమస్యలు, ఇతర అంశాలు ఉన్నాయి. ప్రతి కేసును బీఎల్‌ఓలు, ఈఆర్‌ఓలు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు.

1.48 లక్షల ఓట్లు తేడా ఉన్నట్లు గుర్తింపు

ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వని వారు 86,740 మంది

44,557 ప్రత్యేక కేసులను గుర్తించిన ఎన్నికల యంత్రాంగం

అధికారుల పరిశీలనలో 6,690 ఆబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌ ఓటర్లు

జిల్లాలో ఇప్పటివరకు 85.92 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి

డిజిటలైజేషన్‌ పూర్తయినా

పరిశీలనే కీలకం

డిజిటలైజేషన్‌ అంటే ఫారం ఆన్‌లైన్‌లో నమోదు చేయడం మాత్రమే. వివరాల ధ్రువీకరణ, అభ్యంతరాల పరిష్కారం, క్షేత్రస్థాయి విచారణ పూర్తయిన తర్వాతే తుది ఓటర్ల జాబితా రూపొందుతుంది. అందువల్ల ప్రస్తుతం నమోదైన వ్యత్యాసాలు అన్నీ తుది జాబితాలో మార్పులకు దారితీస్తాయనే అర్థం కాదు. అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాకే వీటిపై తుది నిర్ణయం ఉంటుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు. – డాక్టర్‌ సత్యశారద, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement