ఆస్పత్రి అస్తవ్యస్తంపై కలెక్టర్‌ ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి అస్తవ్యస్తంపై కలెక్టర్‌ ఆగ్రహం

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

వర్ధన్నపేట: వర్ధన్నపేటలోని ఆస్పత్రి అస్తవ్యస్తంగా ఉండడంపై కలెక్టర్‌ సత్యశారద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, మున్సిపల్‌ చైర్మన్‌ పాలకుర్తి సారంగపాణితో కలిసి బుధవారం తనిఖీ చేశారు. అన్ని విభాగాలను పరిశీలించి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న బ్యాండేజీ విభాగంలో ప్రమాదాలు జరిగిన వారికి ఎలా చికిత్స చేస్తారని ప్రశ్నించారు. దుమ్ముధూళిని చూపించగా సిబ్బంది నీళ్లు నమిలారు. విధులకు గైర్హాజరైన వైద్యులు, సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్రగ్‌ స్టోర్‌లో మందులు అస్తవ్యస్తంగా, ఇంజక్షన్‌ గదిలో స్క్రాప్‌ ఉండడం చూసి మందలించారు. తనిఖీ చేస్తున్న సమయంలోనే టాయిలెట్లను శుభ్రం చేయడం ఏమిటన్నారు. టాయిలెట్లకు మరమ్మతులు ఉన్నాయని కలెక్టర్‌ దృష్టికి కాంట్రాక్టర్‌ తీసుకురాగా.. వెంటనే ఆమె స్పందిస్తూ కోటి రూపాయలు అవుతాయా, చిన్నచిన్న మరమ్మతులు చేయించుకుంటే నిధులు ఇవ్వడం లేదా అడిగారు. వైద్య సిబ్బంది, వైద్యులు ఏమైనా డబ్బులు అడుగుతున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు పరిమితికి మించి వైద్యం చేస్తే ప్రాణాపాయం ఉండే ప్రమాదముందని ఓ వైద్యుడి గురించి అన్నారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది, పాలనాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకలను కలెక్టర్‌ దృష్టికి రాగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏ అధికారి, సిబ్బందిపై వేటు పడుతుందో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందికి వెంటనే మెమోలు జారీ చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సాంబశివరావును ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నర్సింహస్వామి, డాక్టర్‌ రామ్మూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ ఇమ్మడి సుధీర్‌కుమార్‌, తహసీల్దార్‌ విజయసాగర్‌, వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజుతో కలిసి వర్ధన్నపేట సీహెచ్‌సీ తనిఖీ

అన్ని విభాగాలు పరిశీలించి సిబ్బంది పనితీరుపై అసహనం

నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement