● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
వర్ధన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికతో గ్రామాల అభివృధ్ది సాధ్యమవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం కొత్తపల్లిలో సర్పంచ్ కౌడగాని సునీత రాజేష్‌ఖన్నా అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామాల ప్రగతి ఎంతో కీలకమన్నారు. 99 రోజుల కార్యాచరణలో ప్రతి అంశం ముఖ్యమన్నారు. గ్రామ సభలను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు తమ వ్యాపారాలు పెంచుకున్నారని, ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని చెబుతున్నారని చెప్పారు. హామీలను ఒక్కసారే నెరవేర్చడం సాధ్యం కాదు కదా అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ టీఎస్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం ద్వారా బలహీనవర్గాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత కోసం స్వయం సహాయక సంఘాల బలోపేతం, వడ్డీ రహిత రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రైతులకు రాయితీ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


