హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎంజీఎం ఎదురుగా ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో బుధవారం చైత్రమాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పసుపుకొమ్ములతో అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీలలితాపారాయణం చేశారు. అనంతరం అన్నప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
రామన్నపేట: జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం జీఎంహెచ్, ఆత్మకూరు, శాయంపేట, ఐనవోలు, వంగర, హసన్‌పర్తి, కమలాపూర్ ఆరోగ్య కేంద్రాల్లో నేటి (గురువారం) నుంచి హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 ఏళ్లు నిండిన బాలికలు 15వ పుట్టిన రోజు జరుపుకుని బాలికలకు వారి తల్లిదండ్రులు తప్పకుండా సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు.
విద్యారణ్యపురి: వచ్చే విద్యాసంవత్సరం 2026–27లో జూన్‌లో మళ్లీ పాఠశాలలు తెరిచిన రోజే ప్రభుత్వ యాజమాన్యాల్లోని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించేందుకు ఈసారి ముందుగానే జిల్లా కేంద్రాలకు హైదరాబాద్ నుంచి పాఠ్యపుస్తకాలు చేరుకుంటున్నాయి. హనుమకొండ జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు సుమారు 35 వేల నుంచి 40 వేల మంది ఉంటారని భావిస్తున్నారు. 2.56 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, బుధవారం వరకు హనుమకొండ జిల్లాకు 90 వేల పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న గదుల్లో పాఠ్యపుస్తకాల గోదాంను ఏర్పాటు చేశారు.
కాశిబుగ్గ: వరంగల్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన నేరుగా ఓపీ విభాగాలను పరిశీలించి, సమస్యలు తెలుసుకున్నారు. ఓపీ విభాగాల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పేషెంట్లకు గతంలో ఒక ఓపీ కౌంటర్ ఉండగా.. కలెక్టర్ ఆదేశాల మేరకు రెండు ఓపీ కౌంటర్లు పనిచేస్తున్నాయి. దీంతో పేషెంట్లకు కొంతవరకు ఇబ్బందులు తగ్గడంతో ఉపశమనం ఏర్పడింది. కాగా, సూపరింటెండెంట్ చాంబర్‌లో డీఎంహెచ్‌ఓ సాంబశిరావుతో పాటు అధికారులు, వైద్య సిబ్బంది దవాఖాన సమస్యలపై సమీక్షించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలాంటి మార్పులు వచ్చాయో వారు చర్చించినట్లు సమాచారం.
పరకాల మున్సిపల్ కమిషనర్
ఎస్.అంజయ్య
పరకాల: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి(బుధవారం) నుంచి పరకాల మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ ఎస్.అంజయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతీ వార్డు గ్రామ సభ ఆయా వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం పెంపు, ప్రభుత్వ పథకాలపై చర్చ, లబ్ధిదారుల అభిప్రాయాల సేకరణ, వార్డు అవసరాల గుర్తింపు వార్డు సమస్యల గుర్తింపుతో పాటు పరిష్కారాలపై చర్చ, పథకాల అమల్లో పారదర్శకత పెంపు వంటి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ గ్రామ సభలకు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు.


