కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి! | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి!

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి!

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

ధికార కాంగ్రెస్‌ పార్టీలో ‘సంస్థాగత’ సందడి కొనసాగుతోంది. ప్రభుత్వం, ప్రజలకు వారధిగా ఉండేలా కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశం మేరకు పాత కమిటీలను రద్దు చేసిన జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)ల అధ్యక్షులు.. వార్డు, డివిజన్‌ కమిటీలనుంచి పూర్తిస్థాయి జిల్లా కమిటీలను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులను పరిశీలకులుగా నియమించారు. హనుమకొండ జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్‌ వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌ మాసాంతానికల్లా అన్ని స్థాయిల్లో సంస్థాగత కమిటీలు వేయాలన్న హైకమాండ్‌ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలను సంప్రదించి కమిటీలను రూపొందిస్తున్నారు.

కమిటీలకు కఠినమైన మార్గదర్శకాలు..

వార్డు, డివిజన్‌, గ్రామ, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలను పూర్తిస్థాయిలో నియమించనున్నారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కేలా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు 30 శాతం ప్రాతినిథ్యం ఉండేలా, పార్టీ బలోపేతం దృష్ట్యా మండల స్థాయి కార్యవర్గాల్లో 35 సంవత్సరాల పైబడిన వారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు కనీసం మూడేళ్లపాటు పార్టీకి చురుకై న సేవలు అందించిన వారికి కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. జిల్లా పరిధి రెండేళ్లు పూర్తి చేసుకున్న మండల, మున్సిపల్‌, కార్పోరేషన్‌ డివిజన్‌ అధ్యక్షులను ఈసారి తప్పనిసరిగా మార్చాలని నిబంధన పెట్టుకున్నారు. ఈ మేరకు వార్డు, డివిజన్‌, గ్రామ, మండల కమిటీలు పూర్తయిన తర్వాత జిల్లా కమిటీలను ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు.

జిల్లా కమిటీల్లో 31 నుంచి 51 మందికి ప్రాతినిథ్యం...

ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో పూర్తిస్థాయి జిల్లా కమిటీ కార్యవర్గం ఈ నెలాఖరుకు ఖరారు కానుంది. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగి నాలుగు నెలలు పూర్తవగా... పూర్తిస్థాయి కమిటీలను వేయలేదు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలోని సుమారు 14 జిల్లాల్లో పూర్తి స్థాయి డీసీసీ కమిటీలు ప్రకటించారు. వీటిలో వైస్‌ ప్రెసిడెంట్లు, జనరల్‌ సెక్రటరీలు, కోశాఽధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు, కార్యవర్గసభ్యులతో పాటు విస్తృత స్థాయి నిర్మాణం పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో పెండింగ్‌లో ఉండగా.. ఇటీవల కసరత్తు మొదలైంది. ఈ క్రమంలోనే వార్డు, డివిజన్‌, గ్రామ, మండల కమిటీలు మొదలు పూర్తిస్థాయి జిల్లా కమిటీల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన జరుగుతోంది. చాల్లా జిల్లాల్లో జిల్లా కమిటీలు జెంబో జెట్‌లుగా నియామకాలు చేశారన్న ఆరోపణలు ఉండగా.. ఉమ్మడి జిల్లాలో మాత్రం చిన్న జిల్లాలుంటే 31.. పెద్ద జిల్లాలైతే 51 మందికి మించకుండ ప్రాతినిఽథ్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం డీసీసీ అధ్యక్షులు ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లను సంప్రదించి జాబితాలు రూపొందించే పనిలో ఉండగా.. ఈ నెల 8న కీలక సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు సమాచారం.

పారదర్శకంగా పార్టీ సంస్థాగత కమిటీలు

ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉండేలా పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం పారదర్శకంగా జరుగుతోంది. అన్ని స్థాయిల కమిటీల్లో సామాజిక ప్రాతినిథ్యం ఉంటుంది. మహిళలకు 30 శాతం అవకాశాలు తప్పనిసరి చేశాం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం మార్గదర్శకాల మేరకు కమిటీలు పని చేస్తాయి. పార్టీ సిద్ధాంతాల పునశ్చరణ, గాంధీజీ ఆశయాల సాధన, క్రమశిక్షణ కలిగిన నాయకత్వ నిర్మాణం కోసం వారం వారం ‘సర్వోదయ చరక అభ్యాస్‌’ ప్రత్యేక శిక్షణ అన్ని స్థాయిల నాయకులకు ఉంటుంది.

– ఇనగాల వెంకట్రాంరెడ్డి,

డీసీసీ అధ్యక్షుడు, హనుమకొండ జిల్లా

పార్టీ కమిటీల నిర్మాణంపై అధిష్టానం దృష్టి..

ఇదివరకున్న కమిటీలను రద్దు చేసిన డీసీసీలు

గ్రామస్థాయి నుంచి కమిటీలు..

మండలాల వారీగా పరిశీలకులు

జిల్లా కమిటీలో 31 నుంచి 51 మందికి ప్రాతినిథ్యం

పల్లెల్లో మొదలైన కాంగ్రెస్‌ కమిటీల సందడి

ఏప్రిల్‌ చివరికల్లా పూర్తిస్థాయి కమిటీలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement