మక్కలకు లేదు మద్దతు | - | Sakshi
Sakshi News home page

మక్కలకు లేదు మద్దతు

Mar 23 2026 10:01 AM | Updated on Mar 23 2026 10:01 AM

మక్కలకు లేదు మద్దతు ఉమ్మడి వరంగల్‌లో యాసంగి సాగు వివరాలు.. ఉన్నతాధికారులకు విన్నవించాం.. దళారులకు అమ్ముకున్న..

పరిశీలనలోనే కేంద్రాల ఏర్పాటు.. ప్రారంభంకాని కొనుగోళ్లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కారణంగా మొక్కజొన్న రైతులకు మార్కెట్‌లో ‘మద్దతు’ దొరకడం లేదు. యాసంగి మక్కల కొనుగోళ్ల కోసం ప్రతీసారి మార్చి మొదటి వారంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే మార్క్‌ఫెడ్‌, ‘ప్యాక్స్‌’, ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఈసారి వేచిచూసే ధోరణిలో ఉన్నాయి. ఎక్కడా కూడా మార్క్‌ఫెడ్‌ ఇంకా కొనుగోళ్లను ప్రారంభించక పోవడంతో సిండికేట్‌గా మారిన కొందరు ప్రైవేట్‌ వ్యాపారులు మార్కెట్‌లో తమకు తోచిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాకు రూ.2,400 కాగా.. కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,950 చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఎంఎస్‌పీతో పోలిస్తే క్వింటాకు రూ.500 నుంచి రూ.650 వరకు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు..

ఈ యాసంగిలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. వ్యవసాయశాఖ అంచనాలను మించి రైతులు 88 శాతం అధికంగా సాగు చేశారు. వాస్తవానికి 2025–26 యాసంగిలో మొత్తం సాగు అంచనా 68,67,407 ఎకరాలు కాగా, 81,20,332 (118 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. ఇందులో మొక్కజొన్న సాగు అంచనా 6,45,574 ఎకరాలకు 12,13,914 (188 శాతం) ఎకరాల్లో వేశారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్‌లో 3,43,732 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న వేశారు. సాగైన మొత్తం విస్తీర్ణంలో సగటున ఎకరానికి 18 క్వింటాళ్లు వస్తే 6,18,717 టన్నులు.. 25 క్వింటాళ్లు వస్తే 8,59,330 టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 26 కేంద్రాలను ప్రతిపాదించిన మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖలు ఈసారి ఇంకా కొనుగోలు కేంద్రాల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో రైతులు అవసరాల కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నెల 18న మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో చర్చకు తేగా.. ఆ తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఐదు రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో పురోగతి లేదు.

2025–26 యాసంగి సాగు అంచనా : 8,96,861 ఎకరాలు

సాగైన విస్తీర్ణం:

10,67,535

(118 శాతం) ఎకరాలు

మొక్కజొన్న సాగు అంచనా :

2,25,259

సాగైన మొక్కజొన్న విస్తీర్ణం :

3,43,732

(152.59 శాతం)

మక్కల దిగుబడి అంచనా(ఎకరానికి):

18-25 క్వింటాళ్లు

దిగుబడి అంచనా:

6.19-8.59 లక్షల

మెట్రిక్‌టన్నులు

కావాల్సిన కొనుగోలు కేంద్రాలు :

30-35

మక్కలకు కనీస మద్దతు ధర రూ.:

2,400

వ్యాపారులు పెడుతున్న ధర:

కనిష్టం రూ. 1,700,

గరిష్టం రూ. 1,950

ఎంఎస్‌పీ కంటే క్వింటాకు ధర:

రూ.500 నుంచి రూ.650 తక్కువ

మొక్కజొన్న పంట చేతికందే సమయంలోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించాం. మక్కలను అమ్ముకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గరకు వెళ్లక తప్పడం లేదు. మద్దతు ధర కంటే ఐదారు వందల రూపాయలకు తక్కువ కొంటున్నరు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.

– తాళ్లపల్లి సారయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌, ‘మ్యాక్స్‌’, భీమదేవరపల్లి

నేను 2 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశా. గతంలో కంటే ఈసారి దిగుబడి కూడా సరిగ్గా రాలేదు. ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు రూ.1,700కే అమ్ముకున్న. వాళ్లు కూడా 20 రోజుల తర్వాత డబ్బులు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే క్వింటాకు రూ.600 నుంచి రూ.700 ఎక్కువగా వచ్చేవి. కొనుగోలు కేంద్రాలు లేక నష్టపోవాల్సి వచ్చింది. – నకీర్త సంపత్‌, రైతు, పీచర, వేలేరు మండలం

కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,400.. వ్యాపారుల ధర రూ.1,950

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 3.43 లక్షల ఎకరాల్లో సాగు

అసెంబ్లీలో ఈనెల 18న చర్చ.. మంత్రి ఆదేశించినా పురోగతి లేదు

మొక్కజొన్న రైతుకు తప్పని దళారుల బెడద

ఈ ఫొటోలో ఉన్నది హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు నకీర్త మధు. మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. ఇటీవల కురిసిన వడగళ్లకు కొంత మేరకు దెబ్బతింది. మిగిలిన పెరడు కోసి కంకి కొట్టాడు. అమ్మేందుకు మక్కలను కల్లం వద్ద ఆరబోశాడు. బయట అమ్ముకుందామంటే ధర తక్కువ. కొనుగోలు కేంద్రాలు అగొచ్చే ఇగొచ్చే అని అధికారులు అంటుంటే ఐదారు రోజుల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాడు. కానీ, ఇంతవరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ పరిస్థితి ఒక్క నకీర్త మధుదే కాదు.. అనేక మంది మక్క రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement