టోల్‌ ఇక్కడ తగ్గింది.. అక్కడ పెరిగింది | Toll charges changed in Several Areas | Sakshi
Sakshi News home page

టోల్‌ ఇక్కడ తగ్గింది.. అక్కడ పెరిగింది

Apr 1 2026 1:43 AM | Updated on Apr 1 2026 1:43 AM

Toll charges changed in Several Areas

పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు ప్లాజాల వద్ద రూ. 5 తగ్గింపు  

హైదరాబాద్‌–వరంగల్‌ జాతీయ రహదారిపై ఆయా

వాహనాలను బట్టి రూ. 5 నుంచి రూ. 20 వరకు పెంపు  

జనగామ–సూర్యాపేట రహదారిలో సింగరాజుపల్లి 

ప్లాజా వద్ద రూ. 5 నుంచి రూ 10 పెంపు  

చౌటుప్పల్‌/రఘునాథపల్లి/దేవరుప్పుల/మంచిర్యాల: హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో టోల్‌ చార్జీలు స్వల్పంగా తగ్గగా, హైదరాబాద్‌–వరంగల్, జనగామ–సూర్యాపేట రూట్‌లో స్వల్పంగా పెరిగాయి. తగ్గిన, పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌–విజయవాడ రూట్‌లో టోల్‌ చార్జీలు తగ్గడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి, సూర్యాపేట జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని ఇబ్రహీంపట్నం మండలం చిల్లకల్లు టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఈ ధరలు కూడా ఒక టోల్‌ప్లాజా వద్ద తగ్గితే మరో టోల్‌ప్లాజా వద్ద యథావిధిగా ఉన్నాయి.  

పంతంగి టోల్‌ప్లాజా వద్ద త్రీ యాక్సల్‌ వాహనాలకు మాత్రమే ఇరువైపులా 5 రూపాయలు తగ్గనుంది, మిగిలిన వాహనాలకు తగ్గింపు చేయలేదు. ఇక్కడ త్రీ యాక్సల్‌ వాహనాలకు ఒక వైపునకు రూ.290 నుంచి రూ.285కు, ఇరువైపులా రూ.435 నుంచి రూ.430 తగ్గింది.  

⇒ కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద కూడా కేవలం త్రీ యాక్సస్‌ వాహనాలకు మాత్రమే ఐదు రూపాయలు తగ్గనుంది. ఇక్కడ ఒకవైపునకు రూ.450 నుంచి రూ.445కు, రెండు వైపులా రూ.675 నుంచి రూ.670కు తగ్గుతుంది.  
⇒ ఏపీలోని చిల్లకల్లు వద్ద కారు, జీపు, వ్యాను, లైట్‌ మోటారు వాహనాలకు ఐదు రూపాయలు తగ్గించారు. ఇక్కడ వీటికి ఒకవైపునకు రూ.105 నుంచి రూ.100కు తగ్గించారు. రెండు యాక్సల్‌ వాహనాలకు రూ.350 నుంచి రూ.345కు, మూడు యాక్సల్‌ వాహనాలకు 24గంటల్లో ఇరువైపులా రూ.570 నుంచి రూ.565కు తగ్గించారు.  

⇒ మంచిర్యాల–చంద్రాపూర్‌ జాతీయ రహదారి 363పై మంచిర్యాల జిల్లా మందమర్రి, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండల సరండి టోల్‌ ప్లాజాల్లో గతేడాదితో పోలిస్తే కనీసం రూ.5 నుంచి నెలవారీ పాస్‌లపై గరిష్టంగా 25 చొప్పున తగ్గాయి. ఒకవైపు రాకపోకలు సాగించే మినీ వాహనాలకు ఒకవైపు జర్నీకి రూ.150 ఉండగా, 145కు తగ్గించారు. 3 జతల టైర్ల వాహనాలకు రూ.340 ఉండగా, ప్రస్తుతం రూ.335కు తగ్గింది. అలాగే నెలవారీ పాస్‌లు సైతం ఒక్కో పాస్‌కు రూ.25 నుంచి గరిష్టంగా ఏడు జతల భారీ వాహనాల వరకు రూ.160 వరకు తగ్గాయి. 

⇒ జనగామ –సూర్యాపేట రహదారిలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి ప్లాజా వద్ద రూ.5 నుంచి రూ.10 వరకు టోల్‌ చార్జీలు పెరిగాయి. కారు (నాలుగు టైర్ల వాహనాలు)కు రూ.35 నుంచి రూ.40, లైట్‌ కమర్షియల్‌ వాహనాలకు ప్రస్తుత రేటు రూ.60 ఉండగా ఇందులో ఎలాంటి మార్పు లేదు. బస్సు, ట్రక్కు వాహనాలకు ప్రస్తుతం రూ.125 ఉండగా 130కి పెరిగింది. రిటర్న్‌ జర్నీకి రూ.5 పెరిగింది. త్రీ యాక్సల్‌ కమర్షియల్‌ వాహనానికి ప్రస్తుతం రూ.135కి 140 పెరగగా, రిటర్న్‌ జర్నీకి రూ.5, ఫోర్‌ టూ సిక్స్‌ యాక్సల్స్‌ వాహనాలకు ప్రస్తుతం రూ.295 నుంచి 300కు పెరగగా రిటర్న్‌ జర్నీకి రూ.5 పెరిగింది. సెవన్‌ టూఓహెచ్‌సీ వాహనాలకు ప్రస్తుతం రూ.240 ఉండగా 245కి, రిటర్న్‌ జర్నీకి రూ.355 నుంచి 365కి పెరిగింది. 

⇒ వరంగల్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై యాద్రాద్రి జిల్లా బీబీనగర్‌ మండలంలోని గూడూరు, జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల టోల్‌ ప్లాజాల వద్ద కారు, జీపు, వ్యాన్, లైట్‌ మోటార్‌ వాహనాలకు ఒకవైపునకు రూ. 5 పెరిగింది. లైట్‌ కమర్షియల్‌ వాహనం, లైట్‌ గూడ్స్‌ వాహనం, మినీ బస్సు సింగిల్‌ జర్నీకి రూ. 5పెరగ్గా, రిటర్న్‌ జర్నీకి రూ.10 పెరిగింది. బస్సు, ట్రక్కుకు ఒకవైపునకు రూ.15 పెరిగింది. త్రీ యాక్సల్‌ కమర్షియల్‌ వాహనం ఒక వైపు రూ.10, రిటర్న్‌ జర్నీకి రూ.15 పెరిగింది. భారీ వాహనాలకు ఒక వైపునకు రూ.20 పెరగ్గా, రిటర్న్‌ జర్నీకి రూ.25 పెరిగింది.  

పెరిగిన వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ల రుసుము 
టోల్‌ప్లాజాల వద్ద స్వల్పంగా టోల్‌ రుసుమును తగ్గించినా, వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ల రుసుమును సైతం స్వల్పంగా పెంచారు. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వార్షిక ఫాస్టాగ్‌ పాస్‌ల రుసుము రూ.3000 ఉండగా దానిని రూ.3075కు పెంచారు. ట్రిప్పుల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement