● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: కార్మికుల సంక్షేమ సేవల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరుపై కలెక్టరేట్ కార్యాలయానికి అందిన ఫిర్యాదులపై కార్మిక శాఖ, గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల నమోదు, క్లయిమ్ దరఖాస్తుల సమర్పణ, పరిశీలన, ఆమోద ప్రక్రియలు పూర్తిగా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యం పెరుగుతుండంతో నిజమైన లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తద్వారా వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పారదర్శకత, జవాబుదారీ తనం ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. అధికారులు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ జయంతి నిర్వహణపై సమీక్ష
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, డాక్టర్ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల నిర్వహణపై ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు.
ప్రజాపాలన ప్రతిబింబించేలా..
ప్రజాపాలన ప్రతిబింబించేలా గ్రామసభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామసభలకు వార్డు సభ్యుల నుంచి ఎంపీలు, మంత్రుల వరకు ఆహ్వానించాలన్నారు. వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేష్, సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
మూడు రోజులు.. 429 దస్తావేజులు
కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఈనెల 28, 30, 31వ తేదీల్లో ప్రత్యేక స్లాట్ బుకింగ్స్‌తో పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పని వేళలు నిర్ణయించింది. దీంతో వరంగల్ ఆర్వో కార్యాలయంలో 28న 149, 30న 170, 31న 110 దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ పూర్తి చేశారు. ఈ మూడు రోజుల్లో 429 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, సుమారు రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం.


