● డీఆర్‌డీఓ ఇన్‌చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి
కాళోజీ సెంటర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఆర్‌డీఓ ఇన్‌చార్జ్ పీడీ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి ఆదేశించారు. సెర్ప్ రాణి రుద్రమదేవి జిల్లా సమైఖ్య ఆధ్వర్యంలో పర్వతగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ట్యాబ్ ఆపరేటర్లు, సెంటర్ ఇన్‌చార్జ్‌లు, సెర్ప్ సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ డీఆర్‌డీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాంరెడ్డి పాల్గొని మాట్లాడుతూ దళారి వ్యవస్థను నిర్మూలించి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే సదుద్దేశంతో ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. సెంటర్ ఇన్‌చార్జ్‌లు (వీఓఏ) బాధ్యతయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ రేణుకాదేవి, మార్కెటింగ్ డీపీఎం దాసు, ఇతర డీపీఎంలు రేవతి, వరలక్ష్మి, జిల్లా సమైఖ్య అధ్యక్ష కార్యదర్శి, కోశాధికార్శులు రజిత, స్వప్న, ఉమా, ఏపీఎంలు సుధాకర్, రాజవీరు, సీసీలు గోలి కొమురయ్య, సుధాకర్, శ్యాంసన్, వీఓఏలు పాల్గొన్నారు.


