● ఆశ వర్కర్లకు, పోలీసులకు మధ్య తోపులాట
● రోడ్డుపై బైఠాయించి ఆశల ధర్నా
హన్మకొండ: ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు రూ.18,000 వేతనం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాలని సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాలు శుక్రవారం హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించారు. రాంనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి మంత్రి ఇంటికి ఆశాలు ర్యాలీగా బయల్దేరారు. మంత్రి ఇంటి సమీపంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, ఆశాలు తీశ్రంగా శ్రమించారు. పోలీసులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మంత్రి ఇంటి సమీపంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మంత్రి పీఏతో ఫోన్‌లో మాట్లాడించి.. శనివారం మంత్రి సురేఖను కలిసేలా ఏర్పాటు చేస్తామని, వినతి పత్రం ఇచ్చి సమస్యలు వివరించుకోవచ్చని సీఐ రంజిత్ కుమార్ చెప్పడంతో శాంతించి ధర్నా విరమించారు. ఆశాలను నాలుగవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ నెల 28న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశాలు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ కార్యక్రమంలో ఆశా యూనియన్, సీఐటీయూ నాయకులు సుంచు రాజేశ్వరి, బైరి శోభ, జనగాం శ్వేత, సీహెచ్ శ్రీవాణి, పద్మ, సీహెచ్ రాణి, రమ, కవిత, రజిత, ఈసంపల్లి శోభ, కరుణలత, లీల, పుష్ప, ప్రేమలతతోపాటు వందలాది మంది ఆశాలు పాల్గొన్నారు.


