దుగ్గొండి: గ్రామంలో రోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు. మండలంలోని మల్లంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. కార్యాలయంలోని వివిధ రకాల రికార్డులు, నర్సరీలో మొక్కలను పరిశీలించారు. వనమహోత్సవంలో నాటడానికి ఏ రకాల మొక్కలు, ఎన్ని మొక్కలు పెంచుతున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఆదాయం పెరిగేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఎంపీఓ మోడెం విద్యాసాగర్, సర్పంచ్ బూర రాధిక, పంచాయతీ కార్యదర్శి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
హామీలను నెరవేర్చాలి : బీజేపీ
న్యూశాయంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణికి వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ వృద్ధులు, వితంతువుల పింఛన్ల మొత్తాన్ని పెంచాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలని డిమండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, రత్నం సతీశ్, నాయకులు పరమేశ్వర్, మురళీకృష్ణ, మహేందర్‌రెడ్డి, హరిశంకర్, బన్న ప్రభాకర్, ఎ.జనార్దన్, ఎ.వెంకట్, రాజేశ్వర్‌రావు, రఘునారెడ్డి, క్రాంతి, రాజు, రాజ్‌కుమార్, శివకుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
23న పర్యావరణ
పరిరక్షణపై కార్యక్రమం
న్యూశాయంపేట: పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
భద్రాద్రి రాముడిగా పూజలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాంచరాత్ర ఆగమానుసారంగా చెరకుమల్లి శ్రీవాత్సవాచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు.
పింఛన్ మంజూరు చేస్తాం
సంగెం : పెయింటింగ్ చేస్తు ప్రమాదానికి గురై వికలాంగుడిగా మారిన మండలంలోని లోహితకు చెందిన అరూరి మహేందర్‌కు దివ్వాంగ పింఛన్ మంజూరు చేస్తామని ఎంపీడీఓ కాసర్ల రవీందర్ తెలిపారు. మహేందర్ తండ్రి భిక్షపతి పదేళ్ల క్రితం మృతి చెందగా తల్లి కోమల కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో మహేందర్ పెయింటింగ్ పని చేస్తు ప్రమాదానికి గురి కాగా నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయి మంచానికి పరిమితమయ్యాడు. మహేందర్‌కు ఇటీవల వైద్యులు సదిరం సర్టిఫికెట్ జారీ చేశారు. దీంతో మహేందర్ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓ శుక్రవారం విచారణ చేపట్టారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, సర్పంచ్ బొమ్మెర నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


