● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖాధికారి అనూజ్‌అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో యాక్షన్‌ప్లాన్ సమర్పించాలి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్‌ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం..
స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఉబేర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్‌న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
కలెక్టర్ డాక్టర్ సత్యశారద ముస్లింలకు ఒక ప్రకటనలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో జిల్లా ప్రజలకు సుఖ సంతోషాలు, సకల శుభాలు కలగాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ అందరూ సోదరభావంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.


