హన్మకొండ అర్బన్: రంజాన్ పండుగ సందర్భంగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారద ఆయా జిల్లాల ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ సోదరభావంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
న్యూశాయంపేట : అంతరించిపోతున్న పక్షి సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హనుమకొండ జిల్లా అటవీశాఖాధికారి, జూపార్క్ క్యూరేటర్ బి.లావణ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు కాకతీయ జూవాలజికల్ పార్క్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలు, పక్షులకు ఆహారం, నీరును అందించి వాటి సంరక్షణకు సహాయపడాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి, కేయూ ప్రొఫెసర్ తిప్పని రాధిక, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ ఎన్‌జీఓ ప్రతినిధులు నాగేశ్వర్‌రావు, శ్యాంసుందర్, రవిబాబు, అటవీశాఖ సిబ్బంది సూరిదాస్, శివకుమార్, శారద, శ్వేత, సురేశ్ పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం లిల్లీపూలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అమ్మవారికి నిర్మాల్యసేవలు, నిత్యాహ్నికం నిర్వహించి విశేషాలంకరణ జరిపారు. అనంతరం ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ, వేద పాఠశాల విద్యార్థులు లిల్లీపూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. వరంగల్‌కు చెందిన సూరినేని నవీన్‌రావు, నీరజ దంపతులు పుష్పార్చన ఉభయదాతలుగా వ్యవహరించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది పర్యవేక్షించారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాద్రి రాముడిగా పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. పాంచరాత్ర ఆగమానుసారం చెరకుమల్లి శ్రీవాత్సవచార్యులు ఆధ్వర్యంలో రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని భద్రాద్రి రాముడిగా అలంకరించి పూజలు, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. యాగశాలలో వివిధ ధాన్యాలు, పండ్లు, పూలు సమర్పిస్తూ మహా సుదర్శన హోమం ని ర్వహించారు. పూజా కార్యక్రమాల్లో తమిళనా డు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు ముఖేశ్, తిరుమూర్తి, బ్రాహ్మణ సేవాసంఘం సమాఖ్య రాష్ట్ర అ ధ్యక్షుడు మోతుకూరి రామేశ్వరరావు, శ్రీరామసేవాసమితి సభ్యుడు కట్ల రాజు ఉన్నారు.
విద్యారణ్యపురి: వేసవి తీవ్రత దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆదేశాల ప్రకారం అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఒంటి పూట మాత్రమే బడులు నడపాలని, రెండుపూటలా నడిపితే చర్యలు తీసుకుంటామని హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో వార్షిక పరీక్షల పేరిట హాల్ టికెట్లు జారీ సమయంలో ఫీజులు చెల్లించని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులొచ్చాయని, విద్యాశాఖ సూచనలు పాటించాలని ఆయన కోరారు.


