వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: పిచ్చుకలు ప్రకృతి సమతుల్య తకు సూచికలని, అవి జీవించాలంటే సహజ వాతావరణాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని పిచ్చుకల సంరక్షణపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణీకరణ, కాలుష్యంతో పిచ్చుకలు తగ్గిపోతుండడంతో ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. అనంతరం పిచ్చుకల గూళ్లను పరిశీలించి కొన్ని పిచ్చుకలను ప్రకృతిలోకి వదిలారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అటవీశాఖ అధికారి అనూజ్‌అగర్వాల్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ పాల్గొన్నారు.
రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ సమర్పించాలి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం యాక్షన్‌ప్లాన్‌ను రెండు రోజుల్లో సిద్ధంచేసి సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశపుహాల్‌లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, రోడ్లు పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
స్వయం ఉపాధి పథకాల కోసం అర్హులైన ఎస్సీ నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. టూవీలర్ ఎలక్ట్రిక్ వాహనాలు, గూడ్స్, ప్యాసింజర్ (ఎలక్ట్రిక్) వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ విభాగాలు అందించి ఊబర్, జొమాటో, స్విగ్గీ, రాపిడో సంస్థలు, వ్యవసాయరంగంతో అనుసంధానం చేసి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. టీజీఓబీఎంఎంఎస్‌న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న కాపీతోపాటు సరైన ధ్రువపత్రాలు ఈనెల 25లోపు వరంగల్ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
23న పర్యావరణ పరిరక్షణపై కార్యక్రమం
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఈనెల 23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఉత్తమ ప్రదర్శనలను ఎంపికచేసి విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.


