● బడ్జెట్‌పై పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం సమావేశం
● హాజరైన అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు
పరకాల: పరకాలలోని అన్ని రకాల ఆదాయ వనరులను ఆధారంగా చేసుకుని పరకాల మున్సిపాలిటీ 2026–27 వార్షిక అంచనా బడ్జెట్‌ను రూ.5 కోట్ల 43 లక్షల 10 వేల 270కు ఆమోదించినట్లు పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ తెలిపారు. శుక్రవారం పరకాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరకాల మున్సిపల్ కొత్త పాలకవర్గం పట్టణాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పట్టణ ప్రజల అవసరాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు, వివిధ అభివృద్ధి పనులకు ఖర్చుల ఆదారంగా బడ్జెట్‌ను ఆమోదించడాన్ని ఆయన అభినందించారు. మోడల్ మున్సిపాలిటీ కోసం రాజకీయాలకతీతంగా పట్టణాభివృద్ధిలో భాగస్వాములం అవుదామని చైర్మన్ సునీల్‌కుమార్ కోరారు. బడ్జెట్ అంచనతో పాటు రూ. 5 కోట్ల 8 లక్షల 2వేలతో అంచనా వ్యయం, రూ.3.48 లక్షలతో మిగులు బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. పరకాల మున్సిపల్ కమిషనర్ ఎస్.అంజయ్య మాట్లాడుతూ.. పరకాల మున్సిపాలిటీ పరిధిలో మరో రూ.50 లక్షలకు పైగా పన్నులు వసూలు జరిగితే కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయని పాలకవర్గ సభ్యులకు వివరించారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఏకు దివ్యతో పాటు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు.
మొక్కల పెంపకానికి రూ.64 లక్షల ఖర్చు
మున్సిపాలిటీ పరిధిలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం కోసం గత బడ్జెట్ 2025–26 సంవత్సరం బడ్జెట్‌లో రూ.64 లక్షలు ఖర్చు చేయయడాన్ని బీఆర్‌ఎస్ 14వ వార్డు కౌన్సిలర్ కొక్కిరాల దీప్తి ప్రశ్నించారు, అదే విధంగా ఈ ఏడాది కూడా అధికంగా హరితహారం మొక్కల కోసం కొత్తగా గ్రీన్ బడ్జెట్‌ను రూ.1 కోటి 2 లక్షల 5 వేలకు పెంచడాన్ని ఆమె తప్పు పట్టారు. గ్రీన్ బడ్జెట్ పేరిట కోట్ల రుపాయలు వృథా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటికలను ఉపయోగంలోకి తీసుకురావాలని 21 వార్డు కౌన్సిలర్ అల్లె దశరథం కోరారు.


