వరంగల్
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి, వరంగల్: ఉగాది పచ్చడిలో వాడే వేపపువ్వు ఈసారి దొరకడం కష్టంగా మారింది. జిల్లాలోని చాలా మండలాల్లో వేప చెట్లు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్ బారిన పడ్డాయి. కొమ్మలు మోడువారి వేప పువ్వు దొరికే పరిస్థితి లేదు. ఉగాది పచ్చడి షడ్రుచుల్లో ఒకటైనా వేపపువ్వుకు ఈసారి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. తప్పనిసరిగా పచ్చడిలో కలపాల్సిన ఈ పువ్వును కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వివిధ పనుల కోసం నగరానికి వచ్చిన వారితో పాటు నగరవాసులు కూడా డబ్బులు పెట్టి మామిడి కాయలతో పాటు ఈ వేప పువ్వు కొనడం కనిపించింది. మార్కెట్‌తో పాటు బహిరంగ ప్రాంతాల్లో రూ.20 నుంచి రూ.50 వరకు వేప పువ్వును వ్యాపారులు విక్రయిస్తున్నారు. అయితే మూడేళ్ల క్రితం మాదిరిగానే ఈసారి కూడా వేప చెట్లు వైరస్ బారిన పడ్డాయి. ఉగాది పచ్చడికి వేపపువ్వుకు బదులు తులసి ఆకులను వాడొచ్చని వేదపండితులు సూచిస్తున్నారు. ‘నగర శివార్లలో ఉన్న వేపచెట్ల పువ్వును కోసుకొని తీసుకొచ్చాం. చాలాచోట్ల వేప చెట్లకు పువ్వు లేదు. కొన్నిచెట్లు ఎండిపోయి ఉన్నాయి. ఉన్న చెట్లను ఎక్కి జాగ్రత్తగా వేప పువ్వు కొమ్మలను కోసుకొని తీసుకొచ్చి అమ్ముతున్నాం’ అని చిరు వ్యాపారి నర్సమ్మ అన్నారు.
ఎలా ఎండిపోతున్నాయంటే..
డై బ్యాక్ వైరస్ సోకిన చెట్లకు ముందుగా కొమ్మల చివరన ఆకులు ఎండిపోయి తర్వాత కొమ్ములు పసుపు రంగులోకి మారుతున్నాయి. కొత్త చిగుర్లు రాకుండా ఎండుతున్నాయి. తర్వాత చెట్లు మొత్తానికి వ్యాపించి పూర్తిగా ఎండిపోతోంది. వ్యాధి సోకిన చెట్ల కాండంపై అండాకార గాఢ గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ వైరస్ గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది. గాయపడిన కొమ్మల ద్వారా శిలీంధ్రం ప్రవేశించి వైరస్ తీవ్రతను పెంచుతుంది. జిల్లాలోని వందలాది చెట్లు ఈ డైబ్యాక్ వైరస్ బారినపడి ఎండిపోతున్నాయి. ‘పురోగతిలో ఉండి ఎండిపోతున్న కొమ్మలను కత్తిరించి ధ్వంసం చేయాలి. కత్తిరించిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.3 శాతం లేదా మాంకోజెట్ 0.2 శాతం ద్రావణాన్ని చల్లాలి. చెట్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నియంత్రణ చర్యలు తీసుకోకపోతే అంతటా వేపచెట్లకు నష్టం జరిగే అవకాశం ఉంది’ అని వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన బి.సిద్ధార్థనాయక్ తెలిపారు. అయితే కొన్నిచోట్ల ఎండిన చెట్లు మళ్లీ చిగురిస్తుండడం శుభసూచకమన్నారు.
ఉగాది పచ్చడి కోసం కొనుగోళ్లు
వైరస్ సోకి ఎండిపోతున్న చెట్లు


