● ప్రముఖ జ్యోతిష్య పండితుడు సముద్రాల సుదర్శనాచార్యులు
గీసుకొండ: ఉగాది పర్వదినం నుంచి ప్రారంభమయ్యే పరాభవనామ సంవత్సరంలో జిల్లాకు ఆదాయం 5.. వ్యయం 14గా ఉంటుందని, అయితే ఈ ఖర్చు శుభపరంగా జరుగుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు, ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు తెలిపారు. బుధవారం ఆయన పంచాంగంలోని విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ ఏడాది వివాహాలు, నూతన గృహ నిర్మాణాలు బాగా జరుగుతాయని పేర్కొన్నారు. నవంబర్ 6 తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. అనారోగ్య పరిస్థితులు పెద్దగా ఉండవని, ఆరోగ్యంతోనే జనులు ఉంటారన్నారు. బంగారం ధరలు స్థిరంగా ఉంటాయని, పత్తి, మిర్చి, వరి, నువ్వుల పంటలు అధికంగా పండుతాయని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, శుక్రుడి కారణంగా స్టేడియాలు, ఆట స్థలాలు, కొత్త క్రీడాకారులు వస్తారని తెలిపారు. అక్టోబర్ వరకు పాలన సజావుగా సాగుతుందని, ఆ తర్వాత రాజకీయ దూషణలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని వివరించారు.


