వర్ధన్నపేట: మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని, ముస్లింలు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేస్తారని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేష్, వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి అన్నారు. ప్రభుత్వం తరఫున సోమవారం మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఫంక్షన్ హాలులో ముస్లింలకు ఏర్పాటు చేసిన దావత్ ఎ ఇఫ్తార్ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. నిష్టతో చేసే ఈ పవిత్ర రంజాన్ మాసం ఎంతో గొప్పదని, ప్రతి మనిషి సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ముస్లింలు ప్రార్థిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఎండీ చోటూ, ఎండీ అప్సర్, ఎండీ అన్వర్, జలీల్, మున్సిపల్ వార్డు సభ్యులు దేవేందర్, పాపారావు, షిభారాణి రాజేందర్, ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


