ఉద్యోగం.. ఔట్‌! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం.. ఔట్‌!

Mar 17 2026 7:19 AM | Updated on Mar 17 2026 7:19 AM

ఉద్యోగం.. ఔట్‌! – IIలోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
తనిఖీల్లో చిక్కుకుంటున్న ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్లు

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో ఖాళీగా ఉన్న కండక్టర్‌ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేస్తున్నారు. వీరికి నామమాత్రపు శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తున్నారు. కండక్టర్‌ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ప్రయాణీకుల రద్దీని తట్టుకుని టికెట్లు జారీ చేయాలి. ఈ క్రమంలో అనుభవలేమితో టికెట్‌ చెకింగ్‌లో చిక్కుతున్నారు. ఫలితంగా ఉద్యోగం ఊడిపోతుంది. కండక్టర్‌ ఉద్యోగం పర్మనెంట్‌ అవుతుందని ఏజెన్సీల మాయలో పడి డబ్బులు చెల్లించిన వారు ఆగమవుతున్నారు. ఏజెన్సీలు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరి స్వల్ప వ్యవధిలోనే నెల రోజులు కూడా విధులు నిర్వహించకుండా, ఒక్క నెల జీతం కూడా తీసుకోకుండా ఉద్యోగాలు కోల్పోయిన వారు వరంగల్‌ రీజియన్‌లో పదుల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. వీరు ఉద్యోగం పోయి.. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఇచ్చిన సొమ్ము (డబ్బులు)పోయి లబోదిబో మొత్తుకుంటున్నారు.

కండక్టర్ల కొరత తీర్చేందుకు..

ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌లో 9 డిపోలున్నాయి. ఏళ్లుగా రిక్రూట్‌మెంట్‌ లేకపోవడం, ప్రస్తుతం పని చేస్తున్న వారు ప్రతీ నెల రిటైర్డ్‌ అవుతుండడంతో ప్రతీ నెల ఖాళీలు పెరుగుతున్నాయి. ఉన్న ఉద్యోగులపై పని భారం పెరుగుతోంది. సాదారణ, అత్యవసర సెలవులు ఇవ్వకుండా డ్యూటీల మీద డ్యూటీలు వేస్తూ డ్రైవర్లపై తీవ్ర పని భారం మోపుతున్నారు. కనీస విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు నిర్వహిస్తుండడంతో అలసటలో డ్రైవింగ్‌తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అద్దె బస్సులు, ఎలక్ట్రిక్‌ బస్సులు రావడంతో కండక్టర్ల కొరత ఏర్పడింది. సంస్థ బస్సుల్లో కండక్టర్ల కొరత తీర్చేందుకు వన్‌మ్యాన్‌ సర్వీస్‌ ద్వారా డ్రైవర్‌కు టిమ్‌ అప్పగించి డ్రైవర్‌తో పాటు కండక్టర్‌ విధులు నిర్వహిస్తున్నారు. అయితే అద్దె బస్సులు, ఎలక్ట్రిక్‌ బస్సు డ్రైవర్లు సంస్థ ఉద్యోగులు కాకపోవడంతో కండక్టర్ల కొరత తీర్చేందుకు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియామకాలు చేపట్టింది.

అక్రమాలకు తెరలేపిన ఏజెన్సీలు

సంస్థ నిబంధనలను ఆసరాగా చేసుకుని ఔట్‌సోర్సి ంగ్‌ ఏజెన్సీలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం అంటేనే ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి.. అయినప్పటికీ పర్మినెంట్‌ అవుతారని ఆశ చూపుతూ ఏజెన్సీలు కండక్టర్లు, డ్రైవర్ల నియామకాల్లో వసూళ్లకు తెగబడ్డారని ఆర్టీసీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వరంగల్‌ రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో దాదాపు 15కు పైగా ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు 317 మంది కండక్టర్లను నియమించారు. ముందుగా నియమితులైన 179 మంది డ్రైవర్లు విధులు నిర్వహిస్తుండగా, మరో 120 మంది డ్రైవర్లు శిక్షణలో ఉన్నారు.

వివరాలు ఎలా వెళ్లాయి?

మరో వైపు అద్దె బస్సు డ్రైవర్ల వివరాలు ఔట్‌సోర్సి ంగ్‌ ఏజెన్సీల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా బయటి వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏయే డిపోలో ఏ బస్సుపై ఏ డ్రైవర్‌ పని చేస్తున్నాడనే వివరాలు ఔట్‌సోర్సింగ్‌ ప్రతినిధుల చేతుల్లోకి వెళ్లాయని, వీటి ఆధారంగా దళారులను నియమించుకుని పర్మినెంట్‌ అవుతారని ఆశ చూపుతూ అద్దె బస్సు డ్రైవర్లను తమ వైపు లాక్కుంటున్నారు. పైగా, ఒక్కొక్కరి నుంచి ముందుగా రూ.20 వేలు, దశల వారీగా మొత్తం 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పని చేస్తున్న డ్రైవర్లు ఎలాంటి సమాచారం లేకుండా వెళ్లిపోవడంతో అద్దె బస్సులు నిలిచిపోతున్నాయి. దీంతో అద్దె బస్సుల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె బస్సుల డ్రైవర్లను ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లుగా తీసుకోవద్దని అద్దె బస్సుల యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

నవ్య (పేరు మార్చాం) అవుట్‌ సోర్సింగ్‌ కండక్టర్‌ ఉద్యోగం కోసం ఏజెన్సీ ప్రతినిధికి రూ.50 వేలు చెల్లించింది. ఉద్యోగంలో చేరిన నాలుగు రోజులకే టికెట్‌ ఇన్‌స్పెక్టర్లు బస్సును తనిఖీ చేశారు. తనిఖీలో ప్రయాణికులకు టికెట్‌ ఇవ్వకుండా చిక్కారు. ప్రయాణికులేమో డబ్బులు ఇచ్చినప్పటికీ తమకు టికెట్‌ ఇవ్వలేదని చెబుతుండగా.. తనకు డబ్బులివ్వలేదని కండక్టర్‌ మొత్తుకుంది. వాస్తవాలు ఎలా ఉన్నా... ఔట్‌సోర్సింగ్‌ కండక్టర్‌ను ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగించింది. నవ్య ఏజెన్సీని సంప్రదిస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. ఏజెన్సీకి చెల్లించిన డబ్బులు రాక, ఉద్యోగం పోయి మొత్తుకుంటోంది. ఇది ఒక్క నవ్య పరిస్థితే కాదు. కొలువు కుదిరిన కొద్ది రోజులకే పదుల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి.

స్వల్ప కాలంలోనే ఊడిపోతున్న కొలువులు

317 మంది కండక్టర్లు,

299 మంది డ్రైవర్ల నియామకం

15కు పైగా ఏజెన్సీలు.. డబ్బులిచ్చి మోసపోతున్న ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement