హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ చాహత్ అధికారులతో కలిసి ప్రజల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులకు వెంటనే సూచనలిచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణికి సంబంధిత జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రతీ అర్జీని పరిశీలించి తగిన పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత అధికారులే స్వీకరించాలి..
కొంతమంది శాఖల నుంచి ఉన్నతాధికారుల బదులు కింది స్థాయి ఉద్యోగులు హాజరవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యాశాఖ, ఫిషరీస్ శాఖల నుంచి జూనియర్ సిబ్బంది రావడం సరికాదని పేర్కొన్నారు. ఇకపై ఇలా జరగకుండా సంబంధిత శాఖల ఉన్నతాధికారులే హాజరై ప్రజల అర్జీలను పరిశీలించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర అధికారులను పంపాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 170 వినతులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్‌రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ శేషాద్రి అధికారులు పాల్గొన్నారు.
సత్వరమే పరిష్కారం చూపండి:
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: అక్రమ పట్టా రద్దు చేయాలని ఒకరు, ఇంటి నిర్మాణానికి సహకరించాలని ఇంకొకరు, లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని మరొకరు.. ఇలా పలు సమస్యల పరిష్కారానికి బాధితులు వినతిపత్రాలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ కలెక్టర్ సత్యశారద వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రీవెన్స్‌లో మొత్తం 136 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, హౌసింగ్ పీడీ, శ్రీవాణి, డీడబ్ల్యూఓ రాజ మణి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు పాల్గొన్నారు.
● కేంద్రప్రభుత్వం 4 లేబర్ కోడ్స్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు విన్నవించారు.
● గృహ నిర్మాణ పథకం కింద డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వరంగల్‌కు చెందిన పి.రాధిక విజ్ఞప్తి చేశారు.
అక్రమ పట్టా రద్దు చేయాలి..
ఖిలావరంగల్ మండల పరిధి సర్వే నంబర్ 243బై1 భూమికి సంబంధించిన నిజమైన పట్టాదారు ఇ.నర్సయ్య. ఇటీవల ఈ భూమికి సంబంధించి రెవెన్యూ అధికారులు తగిన విధివిధానాలు పాటించకుండా అక్రమంగా వేరొకరి పేరుతో పట్టా జారీ చేసినట్లు అనుమానం ఉంది. తగిన విచారణ చేసి అక్రమ పట్టాను రద్దు చేయాలి.
– ఇనుముల సాంబయ్య, ఖిలావరంగల్


