కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పరిశుభ్ర వాతావరణం కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి అంశాలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ గ్రామపంచాయతీల్లో పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో చేపడుతున్న కార్యక్రమాల అమలుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శులు ప్రతీ రోజూ ఉదయం 9.30 గంటల్లోపు కార్యాలయాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూళ్లు లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, డిప్యూటీ డివిజనల్ పంచాయతీ అధికారులు రవిబాబు, గంగభవానీ, తదితరులు పాల్గొన్నారు.


