ఇంటర్‌ మూల్యాంకనం షురూ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మూల్యాంకనం షురూ

Mar 16 2026 8:37 AM | Updated on Mar 16 2026 8:37 AM

కాళోజీ సెంటర్‌: జిల్లాలోని ఎల్‌బీ కళాశాలలో ఇంటర్‌ మూల్యాంకనం ఆదివారం ప్రారంభించినట్లు డీఐఈఓ డాక్టర్‌ శ్రీధర్‌ సుమన్‌ తెలిపారు. తొలిరోజు వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలకు చెందిన ఇంగ్లిష్‌, గణితం, సివిక్స్‌, తెలుగు, హిందీ (5 సబ్జెక్టులు) మూల్యాంకన సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. వ్యాల్యుయేషన్‌ ప్రారంభానికి ముందు ఎల్‌బీ కాలేజీ అడిటోరియంలో శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మూల్యాంకనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. అనంతరం ఇంటర్‌ బోర్డు పరిశీలకుడు రాజన్న మాట్లాడుతూ ఈనెల 18 నుంచి రెండవ స్పెల్‌, 20 నుంచి మూడవ స్పెల్‌ మూల్యాంకనంలో వివిధ సబ్జెక్టులు మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఇంటర్‌ బోర్డు నిబంధనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారానికి

తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

వరంగల్‌: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా ఎరబ్రెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తూర్పు నుంచి పార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 20 బస్సులు, 50 కార్లలో సుమారు 1,500 మంది కార్యకర్తలు తరలివెళ్తున్న వాహన శ్రేణికి డీసీసీ అధ్యక్షుడు ఎండీ.అయూబ్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్‌, బస్వరాజు శిరీషశ్రీమాన్‌, బస్వరాజు కుమారస్వామి, పీసీసీ సభ్యుడు నల్లగొండ రమేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేష్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నారగోని స్వప్న మురళీధర్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోరంట్ల రాజు, తత్తరి లక్ష్మణ్‌, జన్ను రవి, దూపం సంపత్‌, కరాటే ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

నేటినుంచి

ఒంటిపూట బడులు

విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలను సోమవారం నుంచి ఒక్కపూట నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం 7–45 నుంచి మధ్యాహ్నం 12–30 గంటలవరకు తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12–30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో పరీక్షలున్న రోజు మాత్రం విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని అధికారులు వివరించారు.

నేడు గ్రేటర్‌ వరంగల్‌ గ్రీవెన్స్‌

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement