నర్సంపేట: వ్యాపారులు తూనికలు, కొలతల చట్టం నిబంధనలను తప్పనిసరిగా పాటించి వినియోగదారులకు న్యాయం జరిగేలా సరైన కొలతలతో వస్తువులు విక్రయించాలని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ సూచించారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలో తూనికలు, కొలతల చట్టం అమలుపై ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్యాస్ డెలివరీ ఆటోల్లో బరువు, పెట్రోల్ పంపులు, బంగారు దుకాణాలు, కిరాణా షాపులు, చికెన్, మటన్, చేపల దుకాణాలను పరిశీలించి తూనికలు, కొలతలు సక్రమంగా వినియోగిస్తున్నారో లేదో తనిఖీ చేశారు. తనిఖీల్లో తూనికలు, కొలతల చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా, చికెన్, మటన్, చేపల దుకాణాలపై 10 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మనోహర్ మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


